ప్రాణంమీదకు తెచ్చిన ల్యాప్ టాప్ వ్యవహారం…కాల్పులు,కత్తిపోట్లు

  • Published By: murthy ,Published On : September 3, 2020 / 11:49 AM IST
ప్రాణంమీదకు తెచ్చిన ల్యాప్ టాప్ వ్యవహారం…కాల్పులు,కత్తిపోట్లు

లాక్ డౌన్ టైంలో అవసరం కోసం తీసుకున్న ల్యాప్ టాప్ వ్యవహారం ఒక వ్యక్తికి ప్రాణం మీదకు తెచ్చింది. కాల్పులు, కత్తిపోట్లకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని తిమాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే నరేష్ అనే వ్యక్తి తన మిత్రుడు శివకు…. లాక్ డౌన్ సమయంలో ఇంటి వద్ద పని చేసుకోటానికి ల్యాప్ టాప్ ను ఇచ్చాడు. దేశంలో అన్ లాక్ ప్రక్రియ మొదలై దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగుతుండటంతో నరేష్ తన ల్యాప్ టాప్ తనకిచ్చేయమని శివను కోరాడు. అందుకు శివ అంగీకరించలేదు.



ఆగస్ట్ 28 శుక్రవారం ఉదయం తన ఇంటి వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న నరేష్ కు శివ కనపడటంతో మళ్లీ ల్యాప్ టాప్ విషయమై సంప్రదించాడు. దానికి శివ సరైన సమాధానం ఇవ్వకుండా నరేష్ తో గొడవ పడ్డాడు. ఆ తర్వాత శివ, నరేష్ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోయారు.
https://10tv.in/german-halle-university-researchers-stage-crowded-concert-to-study-spread-of-covid-19-at-large-gatherings/
ఒక అరగంట తర్వాత శివ, నరేష్ ఇంటికి తన మిత్రులు సుర్జిత్, భరత్, అన్నులతో వచ్చి ల్యాప్ టాప్ విషయం మాట్లాడదాం బయటకు రమ్మని పిలుచుకు వెళ్లాడు. తాను బయటకు వెళుతున్నానని నరేష్ తన సోదరితో చెప్పి బయటకు వచ్చాడు. శివతో తన అన్నవెళ్లటం నరేష్ సోదరి చూసింది.



బయటకు వచ్చిన నరేష్ తో భరత్ అనే వ్యక్తి ల్యాప్ టాప్ విషయమై….కొంచెం అవతలకు వెళ్ళి మాట్లాడదామని చెప్పి కారులో తిమాపూర్ పోలీసు స్టేషన్ సమీపంలోకి తీసుకు వెళ్లారు. అక్కడ ల్యాప్ టాప్ విషయమై మాట్లాడుతుండగా శివ తన స్నేహితులతో కలిసి నరేష్ పై కాల్పులు జరిపాడు. కాల్పులు తప్పించుకునే క్రమంలో నరేష్ పారిపోతుండగా నలుగురిలో ఒకరు అతడ్ని కత్తితో నాలుగు సార్లు పొడిచాడు.

ఈ గందర గోళం గమనించి స్ధానికులు అక్కడకు చేరుకునే సరికి శివ తన స్నేహితులతో కలిసి పరారయ్యాడు. స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న నరేష్ ను ఆస్పత్రికి తరలించారు.



గాయలతో నరేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేష బంధువు జస్వంత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూర్జిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.