తవ్వే కొద్దీ బయటపడుతున్న మాదక ద్రవ్యాల గుట్టు

  • Edited By: murthy , August 20, 2020 / 10:52 AM IST
తవ్వే కొద్దీ బయటపడుతున్న మాదక ద్రవ్యాల గుట్టు

హైదరాబాద్ జిన్నారంలోని పారిశ్రామికవాడ నుంచి ముంబై తరలిస్తున్న మాదకద్రవ్యాల పట్టివేత కేసులో పోలీసులు బుధవారం మరో రూ. 6కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.ఇప్పటికే వివిధ సోదాల్లో రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులు తాజాగా45 కిలోల ఎపిడ్రిన్ తో పాటు 7.5 కిలోల మెపిడ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వీటిని భూమిలో దాచి పెట్టారు. ల్యాబోరేటరీ ఆవరణలోనే గుంతలు తవ్వి ప్లాస్టిక్ సంచులలో, గోనె సంచులలో పెట్టి వీటిని దాచి పెట్టారు.ఈ కేసులో కీలక నిందితుడు వెంకట రెడ్డి తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఇతర నిందితులను పట్టుకునే పనిలో డీఆర్ఐ అధికారులు ఉన్నారు.

ముంబై, హైదరాబాద్ కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటిలిజెన్స్ అధికారులు మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ముంబై కి తరలిస్తున్న 142.6 కిలోల మెఫెడ్రన్, 31 కిలోల ఎపిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు.మాదక ద్రవ్యాల సరఫరా ముఠా హైదరాబాద్ లోని జిన్నారం, ఐడీఏ, బొల్లారం, పటాన్ చెరు,మేడ్చల్, హయత్ నగర్, ప్రాంతాల్లో మూత పడిన పరిశ్రమలు, కోళ్ల ఫారాలను అద్దెకు తీసుకుని అక్కడ వీటిని దాచిపెట్టి ఈదందా కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.