ఇంటి డాబాపై డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • Published By: murthy ,Published On : November 13, 2020 / 03:49 PM IST
ఇంటి డాబాపై డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు

Family finds two bags full of currency notes, jewellery on the roof of their house : ఉత్తర ప్రదేశ్ లోని  మీరట్ లో చోరీ అయిన సొత్తును పోలీసులు 48 గంటల్లోగా, అనూహ్య రీతిలో స్వాధీనం చేసుకున్నారు.  ఒక వ్యక్తి ఇంటి డాబా నుంచి పోలీసులు లక్షలాది రూపాయల నగదు…బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో పోలీసులు వీటిని సీజ్ చేసి నిందితులని అరెస్ట్ చేశారు.

మీరట్ లోని మిషన్ కాంపౌండ్ ఏరియాలో నివసించే వరుణ్ శర్మ అనే వ్యక్తి రోజూ లాగానే బుధవారం ఉదయం నిద్ర లేచి మార్నింగ్ వాక్ చేయటానికి తన డాబా ఎక్కాడు. అతనికి అక్కడ రెండు పెద్ద బ్యాగులు కనిపించాయి. తనకు తెలియకుండా తన ఇంటిపైకి బ్యాగులు ఎలా వచ్చాయా అని ఆలోచనలో పడి వాటిని తెరిచి చూశాడు.



బ్యాగులు తెరిచి చూసిన వరుణ్ శర్మ షాక్ కు గురయ్యాడు. వాటినిండా డబ్బు,బంగారం ఉన్నాయి. కొద్ది సేపటికి తేరుకున్న వరుణ్ శర్మ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు వాటిని స్వాధీనం  చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆడబ్బులు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దొంగను త్వరగానే కనిపెట్టేశారు.

అప్పటికి రెండు రోజులు క్రితం వరుణ్ శర్మ పక్కన ఇంట్లో నివసించే పవన్ సింగ్ అనే దుప్పట్ల వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ క్లూ దొరకలేదు. పవన్ సింగ్ ఇంట్లో గతంలో పనిచేసిన నేపాలి రాజు అనే వ్యక్తే  ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు.



ఇంట్లోని మగవారంతా షాపు వద్ద వ్యాపారంలో మునిగి ఉండగా, మహిళలు దీపావళి సందర్భంగా షాపింగ్ కు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో దొంగతనం జరిగింది. గతంలో పవన్ సింగ్ ఇంట్లో పనిచేసిన రాజు అనే నేపాలి మంగళవారం రాజు ఇంటికి వచ్చాడు. రెండేళ్ల క్రితం వరకు అక్కడ పనిచేసి ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని ఆపలేదు.

నేరుగా ఇంట్లోకి వెళ్లిన రాజు నగదు, బంగారం మూటలు కట్టి పక్కబిల్డింగ్ పైకి విసిరేసాడు. దీన్ని గమనించిన ఒక సెక్యూరిటీ సిబ్బంది రాజును పట్టుకోగా…..రాజు అతడితో బేరం పెట్టుకుని చోరీ సొత్తులో కొంత మొత్తం ఇస్తానని బేరం కుదుర్చుకున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చోరీ జరిగిన సంగతి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.



నిందితుల కోసం గాలింపు చేస్తుండగానే నగదు,నగలు దొరకటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పవన్ సింగ్ తన నగలను గుర్తించాడు. కాగా..తన ఇంట్లో ఎంత నగదు పోయిందనే పూర్తి సమాచారాన్ని పవన్ సింగ్ పోలీసులుకు ఇవ్వలేదు. దీంతో స్వాధీనం చేసుకున్నవాటిలో రూ.14 లక్షల నగదు, బంగారం లభ్యమైనట్లు సదర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దినేష్ బాగెల్ తెలిపారు.

సీసీటీవీ ఫుటేజిలో దొరక్కుండా ఉండేందుకు దొంగిలించిన సొత్తును నిందితులు పక్కన ఇంటి డాబా పైకి విసిరేసినట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు అనుమానిత  నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.