అధికారిణి ఆత్మహత్యకు దారితీసిన భర్త అక్రమ సంబంధం

  • Published By: murthy ,Published On : August 13, 2020 / 01:01 PM IST
అధికారిణి ఆత్మహత్యకు దారితీసిన భర్త అక్రమ సంబంధం

వాళ్లిద్దరి మతాలు వేరు… అయినా  ప్రేమించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు.. ఒకే డిపార్డ్ మెంట్ లో పని చేస్తున్నారు. ఆదర్శంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ పాప పుట్టింది.
సాఫీగా సాగుతున్న వారి జీవితంలో కలతలు మొదలయ్యాయి. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో గొడవలు పెరిగాయి.  ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేరోక స్త్రీతో ఉండటాన్ని సహించలేని ఇల్లాలు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.

మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన వహీదా బేగం(32) ఫారెస్ట్ డిపార్డ్ మెంట్ లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఆమె అదే డిపార్ట్ మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్ను భానూ ప్రకాష్ తో ప్రేమలో పడ్డారు. వహీదా జిల్లాలోని మ‌హ్మ‌దాబాద్‌లో ప‌నిచేస్తూ ఉండగా… భాను ప్రకాష్ మ‌హ బూబ్‌న‌గ‌ర్ అట‌వీ కార్యాల‌యంలో పని చేస్తున్నాడు. వీళ్లిద్దరూ ఒకే డిపార్ట్ మెంట్ కావటంతో పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి వీరికి ఒక పాప కలిగింది.

forest officer suicide

సాఫీగా సాగిపోతన్న వీరి కాపురంలో ఇటీవల కలతలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావటం మొదలయ్యాయి. భాను ప్రకాష్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవటం వహీదా తట్టుకోలేక పోయింది. ఈ విషయమై పోలీసు స్టేషన్ లో పంచాయితీ పెట్టింది. అనేక సార్లు పోలీసులు వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతనిలో ఏ మార్పు రాలేదు. వారిద్దరిమధ్య వివాదాలు సమసి పోలేదు. దీంతో ఆమె జీవితంపై విరక్తి చెందింది.

బుదవారం ఆగస్టు 12న, వహీదా యధావిధిగా విధులకు హాజరయ్యింది. తన కార్యాలయం పక్క గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగింది. తర్వాత ఆ గదిలోంచి బయటకు వచ్చి, సహచర అధికారులు, ఉద్యోగుల ఎదుట కూర్చుంది. అప్పటికే పురుగుల మందు తాగి ఉండటంతో కొద్ది సేపటికి ఆమెకు కడుపులో నొప్పి రావటం మొదలయ్యింది.

కొంత సేపు ఓర్చుకున్నప్పటికీ ఆమె వల్ల కాలేదు. ఆ నొప్పిని భరించలేక తాను పురుగుల మందు తాగిన విషయాన్ని తోటి ఉద్యోగులకు చెప్పింది. వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడవటంతో ఉద్యోగులు షాక్ కు గురయ్యారు.

ఈవిషయాన్ని పోలీసులతోపాటు ఆమె తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చారు తోటి ఉద్యోగస్తులు. భాను ప్రకాష్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో తరచూ భార్యా భర్తలు గొడవ పడుతూ ఉండేవారని వహీదా తల్లి ముబారక్ బేగం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు.

తమ కూతురు ఆత్మహత్యకు అల్లుడి వివాహేతర సంబంధమే కారణమని ఫిర్యాదులో ఆరోపించటంతో పోలీసులు కేసు నమోదు చేసి, భాను ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.