పేరెంట్స్ పై అలిగి… బ్లాక్ మెయిల్ చేయబోయిన బాలిక

  • Published By: murthy ,Published On : August 5, 2020 / 11:13 AM IST
పేరెంట్స్ పై అలిగి… బ్లాక్ మెయిల్ చేయబోయిన బాలిక

ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నప్పుడు వారిపట్ల తల్లితండ్రులు సరైన శ్రధ్ద వహించాలి. లేకపోతే ఆ చిన్నారి మనస్సుల్లో దురభిప్రాయం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్ధితులను సరిదిద్దేందుకు మెట్రో నగరాల్లో వ్యక్తిత్వ ,కుటుంబ వికాస నిపుణులు ఉంటారు. ముంబై మహానగరంలో వ్యాపారాల్లో  బిజీగా ఉన్న పేరెంట్స్ తనను పట్టించుకోవటంలేదని భావించిన ఓ చిన్నారి తల్లి తండ్రులను బ్లాక్ మెయిల్ చేయబోయింది. అప్పుడు పోలీసులు వచ్చి తల్లితండ్రులను శిక్షిస్తారని భావించింది. అందులో భాగంగా పేరెంట్స్ ను బెదిరిస్తూ ఈ మెయిల్స్ పంపించింది.



ముంబై లో పెద్ద ఎత్తున వడ్డీ వ్యాపారం చేసే ఓ వ్యాపారికి ఇద్దరు కూతుళ్లు. ఎప్పుడూ డబ్బు లావాదేవీలతో బిజీగా ఉండే అతని పిల్లల బాధ్యత ఎక్కువగా అతని భార్య చూసుకుంటుంది. ఇటీవల అతని భార్యను బెదిరిస్తూ ఈ మెయిల్స్ వచ్చాయి. తాను చైనీస్ జాతీయుడనని…. తనకు లక్ష రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ మెయిల్ వచ్చింది.

వెంటనే అతను ముంబై లోని బోరివాలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే వారు ఐపీసీ సెక్షన్ 387 (వ్యక్తిని మరణానికి భయపడటం లేదా దోపిడీకి గురిచేయడానికి తీవ్రంగా బాధపడటం) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

వివిధ మెయిల్ ఐడీలతో ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓరోజు అతని భార్యకు ఇంకో మెయిల్ వచ్చింది. అందులో రూ. 12 మిలియన్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు అపరిచిత వ్యక్తి. తాము అడిగినంత డబ్బు ఇవ్వక పోతే మీ ఇద్దరు కూతుళ్ళను చంపేస్తానని అందులో బెదిరించాడు.



ఈ విషయాన్ని పోలీసులకు తెలియ చేశాడు ఆ వడ్డీ వ్యాపారి. ఈ కేసును క్రైం బ్రాంచ్ పోలీసులకు బదలాయించారు స్ధానిక పోలీసులు. వారు సైబర్ క్రైం పోలీసుల సహాయంతో ఈమెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ చేపట్టారు.

తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ ఈమెయిల్ ఐడీ సదరు వ్యాపారి పేరుతో ఉన్న సిమ్ కార్డు నుంచే వచ్చినట్లు గుర్తించారు. అతని భార్యకి ఇంతకు ముందు వివిధ ఐడీలతో వచ్చిన మెయిల్స్ కూడా ఇదే ఐపీ నుంచి వచ్చినట్లు గుర్తించారు.

ఆ ఫోన్ నెంబరును వడ్డీ వ్యాపారి పెద్ద కుమార్తె(12) వాడుతున్నట్లు గుర్తించారు. 12 ఏళ్ల బాలికను పోలీసులు మంచితనంగా దగ్గరకు తీసుకుని విచారించగా విస్తు పోయే విషయాలు చెప్పింది. తానే ఈ మెయిల్స్ పంపినట్లు అంగీకరించింది. తన చెల్లెలు(4) పుట్టినప్పటినుంచి తల్లి తండ్రులు తనను పట్టించుకోవటం లేదని…ఎక్కువగా చెల్లినే ప్రేమిస్తున్నారని చెప్పింది.



ఏదైనా అడిగినా నాకు కొనివ్వకుండా చెల్లికే కొంటున్నారని…తనను చీటికి మాటికి తిడుతున్నారని చెప్పింది. దాంతో తల్లితండ్రులమీద కోపం పెరిగిందని చెప్పింది. ఇలాంటి బెదిరింపు మెయిల్స్ పంపిస్తే పోలీసులు వచ్చి తల్లితండ్రులను అరెస్టు చేసి శిక్షిస్తారనే మెయిల్స్ పంపినట్లు తల్లి తండ్రులపై ఆరోపించింది. బాలిక చెప్పిన విషయం విన్న తల్లితండ్రులు కేసును ఉపసంహరించుకున్నారు.