స్వఛ్చంద సంస్ధ ముసుగులో మోసం…..నిర్వాహకుడి అరెస్ట్

  • Published By: murthy ,Published On : November 14, 2020 / 11:36 AM IST
స్వఛ్చంద సంస్ధ ముసుగులో మోసం…..నిర్వాహకుడి అరెస్ట్

kadapa man arrested for cheating : స్వఛ్చంద సంస్ధ పేరుతో ఎన్నారైను రూ.25 లక్షలకు మోసం చేసిన కేసులో సంస్ధ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా గోపవరం మండలం బెడుసుపల్లికి చెందిన మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి పీపుల్స్ ఎగైనెస్ట్ కరప్షన్ అనే స్వఛ్చంద సంస్ధను నెలకొల్పి సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.

సోషల్ మీడియా వేదికగా యూ ట్యూబ్ చానల్, ఫేస్ బుక్ లలో లోక్ సత్తా వ్యవస్ధాపకుడు జయప్రకాష్ నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, రాష్ట్ర సమాచార శాఖ మాజీ కమీషనర్ విజయ్ బాబు తదితర ప్రముఖులను ఆహ్వానించేవారు.



ఈ క్రమంలో ఆయనకు మైదుకూరు మండలం శెట్టివారి పల్లెకు చెందిన అమెరికా ఎన్నారై రాజేష్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో భాగంగా తన స్వఛ్చంద సంస్ధ గురించి వివరిస్తూ… జులై నెలలో కేంద్రం తరుఫున లైవ్లీ హుడ్ మిషన్ కింద సామాజిక సేవా ప్రాజెక్టు మంజూరైనట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంవత్సరానికి రూ.50 కోట్లు, నిర్వహణ ఖర్చుల కింద 12 శాతం నిధులు ఇస్తారని, ఖర్చులన్నీ పోగా మూడుకోట్లు మిగులుతుందని ఆయనకు ఆశ కల్పించారు.

ఈప్రాజెక్టు విషయమై ఏపీ సీఎం పేషీలోని సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డిలతో మాట్లాడుతున్నానని నమ్మ బలికాడు. శ్రీకాంత్ రెడ్డి మాటలు నమ్మిన రాజేష్ కుమార్ శ్రీకాంత్ రెడ్డి బ్యాంక్ ఎకౌంట్ కు రూ.25లక్షలు జమ చేశాడు. రెండోదఫా తన మామ, కడప ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సీనియర్ మేనేజర్ వెంకట శివారెడ్డి ద్వారా రూ. 10లక్షలు అందచేశాడు. ఆ డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి బంగారు ఆభరణాలు, కారు కొన్నారు.



అనంతరం కాలంలో ప్రాజెక్ట్ విషయమై రాజేష్ కుమార్ శ్రీకాంత్ రెడ్డితో మాట్లాడాలని ప్రయత్నించగా ఫోన్ స్విఛ్ఛాఫ్ లో ఉండటం మొదలైంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా శ్రీకాంత్ రెడ్డి రాజేష్ కుమార్ కు లైన్ లోకి రాకపోవటంతో మోసపోయానని గ్రహించాడు.

తన మామ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించగా…కేసు నమోదు చేసుకున్న బద్వేలు పోలీసులు విచారణ జరిపి శ్రీకాంత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. అతని వద్దనుంచి రూ. 20లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కారు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు రూరల్ పోలీసు స్టేషన్ ఎస్సై కృష్ణయ్య చెప్పారు.