కూతురు ప్రేమ వ్యవహారంలో తల్లీ,కూతురు మృతి

  • Published By: murthy ,Published On : August 20, 2020 / 09:00 AM IST
కూతురు ప్రేమ వ్యవహారంలో తల్లీ,కూతురు మృతి

కన్న కూతురును చదివించి గొప్పదాన్ని చేయాలనుకున్నారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా ప్రయోజకురాలిని చేయాలని కలలు కన్నారు ఆ తల్లితండ్రులు. కానీ యుక్త వయస్సులో ఉన్న ఆ బాలిక ప్రేమవలలో పడింది. అది తట్టుకోలేని తల్లి తండ్రులు కూతురిని దండించాలనుకున్నారు. క్షణికావేశంలో చేసిన పనివల్ల తల్లి, కూతురు మంటల్లో కాలిపోయారు.



రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన చంద్రకళ దంపతులకు ఒక కుమార్తె స్రవంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త పాండు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటర్‌ చదువుతున్న స్రవంతి అదే గ్రామానికి చెందిన రాందాసు అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే వారిని తల్లిదండ్రులు మందలించడంతో ఇటీవల రాందాసు కుటుంబం గ్రామం నుంచి వెళ్లిపోయారు. పెద్దలు నచ్చచెప్పి వీరిని మళ్లీ గ్రామానికి తీసుకువచ్చారు.

తర్వాత కూడా స్రవంతి, రాందాస్ లలో మార్పురాకపోవడంతో తల్లిదండ్రులు కుమార్తెను పలుమార్లు హెచ్చరించారు. ఈ విషయమై స్రవంతి (17), ఆమె తల్లి చంద్రకళ (35) తరచూ గొడవ పడుతుండేవారు. ఆగస్ట్ 15న తల్లీకూతురు మళ్లీ ప్రేమ విషయమై ఘర్షణ పడ్డారు.



అదే సమయంలోనే చంద్రకళ భర్త పాండు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి భార్య కూతురు గొడవపడటం గమనించాడు. ఆవేశం పట్టలేక స్రవంతిపై కిరోసిన్‌ పోయడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో పక్కనే ఉన్నభార్య చంద్రకళపై కూడా కిరోసిన్‌ పడింది.

అప్పటికే కూతురు ప్రేమ వ్యవహారంపై కోపంతో ఉన్న చంద్రకళ.. కూతురుకు నిప్పంటించగా తనకు కూడా మంటలంటుకున్నాయి. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికితరలించి ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు.



ఉస్మానియా ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తల్లి,కుమార్తె మృతి చెందారు. తండ్రి పాండుపై పోలీసులు కేసు నమోదు చేసారు. తండ్రి క్షణికావేశంలో చేసిన పని ఇద్దరి మృతికి కారణం కాగా, తండ్రిపై కేసు నమోదు కావడంతో కుటుంబం ఛిన్నాభిన్నమైంది.