ఆన్ లైన్ క్లాసులకు స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదని బాలిక ఆత్మహత్య

  • Publish Date - August 24, 2020 / 09:36 AM IST

ఆన్ లైన్ క్లాసులుకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటంలేదని మనస్తాపంతో ఒక దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ కి చెందిన రజిత మొదటి భర్త కంకణాల సుధాకర్ 12 ఏళ్ల కిందట చనిపోవటంతో, తన తల్లి, కుమార్తె సింధుజతో కలిసి కృష్ణా నగర్ లో జీవిస్తోంది. కొన్నాళ్ళకు రజిత సూరు రవికిరణ్ ను వివాహం చేసుకుంది.



దివ్యాంగురాలైన కుమార్తె సింధుజ ప్రస్తుతం 10 వ తరగతి చదువుతోంది. లాక్ డౌన్ కారణంగా స్కూళ్లు మూసేసారు. కొద్ది రోజులుగా ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. అందుకోసం సింధుజ ఇంట్లో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకుని ఆన్ లైన్ క్లాసులు వింటోంది. రజిత మధ్య మధ్యలో సెల్ ఫోన్ తీసుకుంటూ ఉండేది. ఇది సింధుజకు ఇబ్బందిగా మారింది. కొన్ని సార్లు తల్లిని ఫోన్ అడిగినా ఇవ్వకపోవటంతో సింధుజ మానసికంగా బాధపడింది.



ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి , ఇంటి  పైకప్పుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్ళిన తల్లి, ఇంటికి వచ్చి చూసి విగతజీవిగా మారిన  కూతురుని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. సమాచారం తెలుసుకున్నఎన్టీపీఎస్ పోలీసులు ఘటనా స్దలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు