అనాధాశ్రమంలో మరో బాలికపైనా అత్యాచారం !

  • Published By: murthy ,Published On : August 14, 2020 / 12:11 PM IST
అనాధాశ్రమంలో మరో బాలికపైనా అత్యాచారం !

అమీన్ పూర్ అనాధాశ్రమంలో బాలికలపై జరిగిన దారుణాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.మారుతీ అనాధాశ్రమంలో ఏడాదికిపైగా అత్యాచారానికి గురైన మైనర్ బాలిక చికిత్స పొందుతూ బుధవారం మరణించటంతో ఇక్కడ జరిగే అకృత్యాలు బయటపడుతున్నాయి.

తనలాగే మరోక బాలిక కూడా అత్యాచారానికి గురైందని మరణించిన బాలిక కొన్ని రోజుల క్రితం వెల్లడించిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక కూడా అస్వస్దతకు గురవ్వటంతో ఆమె తల్లి తండ్రులువచ్చి నిలదీశారని మరణించిన బాలిక పిన్ని తెలిపింది. ఆశ్రమ నిర్వాహకురాలు విజయ బెదిరించటంతో వారు తమ కుమార్తెను తీసుకువెళ్లిపోయారు.

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు వేణు గోపాల్ రెడ్డి చాలా ఏళ్ళనుంచి చేయూత ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్ధను నిర్వహిస్తున్నాడు. ఒక ప్రైవేట్ ఫార్మాకంపెనీలో సూపర్ వైజర్ గా పని చేసే వేణుగోపాలరెడ్డి కి పలుబడి ఉండటంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లో అధికారులను సైతం లోబరుచుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలో ఓ ముఖ్యురాలితో వేణుగోపాల్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, కమిటీ సమావేశాల్లో సైతం అతడు కూర్చునేవాడని ఓ ఎన్జీవో ప్రతినిధి తెలిపారు. దాతల నుంచి విరాళాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులను రాబట్టడంలో వేణుగోపాల్‌రెడ్డి నేర్పరి అని ఇతర ఎన్జీఓ సంఘాల ప్రతినిధులు చెపుతున్నారు.

14 ఏళ్ళ బాలిక పై అత్యాచారం చేయటానికి అమీన్ పురా అనాధశ్రమ నిర్వాహకురాలు చెలుకూరు విజయ, ఆమె సోదరుడు సూరపనేని జయదీప్ లు వేణు గోపాల రెడ్డిక సహకరించారు. మరో బాలికపై కూడా వేణుగోపాల రెడ్డి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. అమాధశ్రమానికి తరచూ ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు, దాతలు వచ్చి స్వీట్లు, డబ్బులు ఇచ్చి వెళ్లే వారని… ఈ వ్యవహారంలో వేరే వ్యక్తుల పాత్రకూడా ఉండ వచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం
జులై 31న తేదీన అమీన్ పురా ఘటన వెలుగులోకి రాగా ,ఈ కేసును దర్యాప్తు చేయటంలో పోలీసులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారనే విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అనాథాశ్రమంలో 70 మందికి పైగా అనాథ, పేద బాలికలు ఉండగా, లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కొంతమంది తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో లాక్‌డౌన్‌లో 49 మంది ఇక్కడ ఆశ్రయం పొందారు.

వీరిలో 29 మంది బాలికలు 18 ఏళ్ల వయస్సు లోపు గలవారు ఉన్నారు. కేసు నమోదైన వెంటనే ఇక్కడ ఆశ్రయం పొందిన బాలికలందరినీ మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ నిర్వహించి, వారిపై కూడా ఏమైనా అఘాయిత్యాలు జరిగాయా అనే అంశాన్ని కూపీ లాగడంలో పోలీసులతోపాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు నిందితుడు వేణుగోపాల్ రెడ్డి తనకున్న పలుకుబడితో కేసును నీరుగార్చాడనే విమర్సలు ఉన్నాయి.

కాగా…..అత్యాచారానికి గురై బుధవారం మరణించిన బాలిక మర్మంగాలకు తీవ్రమైన గాయాలు కావటంతోఅక్కడ ఏర్పడిన ఇన్ ఫెక్షన్ రక్తంతో పాటు మొత్తం శరీరానికి వ్యాపించిందని….ఆమె సెప్టిసియాతో మరణించిందని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు చెపుతున్నారు. మరో వారంరోజుల్లో పూర్తి స్ధాయి నివేదిక వస్తుందని ….అది వచ్చాకే బాలిక మరణానికి పూర్తి కారణాలు తెలుస్తాయని అంటున్నారు.