వాట్సప్ గ్రూప్ లో అశ్లీల వీడియో షేర్ చేసిన అధికారి

  • Published By: murthy ,Published On : July 15, 2020 / 10:17 AM IST
వాట్సప్ గ్రూప్ లో అశ్లీల వీడియో షేర్ చేసిన అధికారి

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనివారంటూ ఎవరూలేరు. నూటికి 90 శాతం పైగా ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అందులో సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ ను అందరూ ఉపయోగిస్తున్నారు. సమాచారం మార్పిడికి ఇప్పుడు ఇది అందరి మన్ననలు పొందింది. ప్రభుత్వ అధికారులు కూడా వారివారి ఆదేశాలను తమ కింది వారికి వాట్సప్ గ్రూప్ ద్వారానే షేర్ చేస్తున్నారు. అలాంటి ఓ వాట్సప్ గ్రూప్ లో ప్రభుత్వ అధికారి అశ్లీల వీడియో అప్ లోడ్ చేసారు. ఇది కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది.

మేడ్చల్‌ జిల్లా కీసర మండల పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విలేకరులకు సమాచారాన్నిఅందించేందుకు గతంలో కీసర హరితహారం అనే వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. ఈ గ్రూప్‌లో కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లు, మీడియా ప్రతినిధులు అందరూ సభ్యులుగా ఉన్నారు.

సోమవారం జులై 13వ తేదీ రాత్రి 11గంటలకు ఓ మండల స్థాయి అధికారి కీసర హరితహారం గ్రూప్‌లో అశ్లీల వీడియో పోస్ట్‌ చేసింది. ఇది కొద్ది సేపట్లోనే వైరల్‌ కావడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో గ్రూప్‌ అడ్మిన్లుగా ఉన్న ఇద్దరు వెంటనే గ్రూప్‌ను డిలిట్‌ చేసి కొత్త గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగి ఇలా చేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాగా….. వాట్సా‌ప్ లో వైరల్‌గా మారిన వీడియో పొరపాటున పోస్ట్‌ అయిందని సదరు అధికారి వివరణ ఇచ్చారు. ఎన్‌ఆర్‌జీఈఎస్‌ పథకంలో భాగంగా డ్రమ్ములో ఇంకుడు గుంతల ఏర్పాటు చేసిన ఫోటోలు పంపించబోతే వాటిలో అసభ్యకర వీడియో ఉన్నదని గ్రహించలేదని తెలిపారు. పొరపాటున గ్రూప్‌లో పోస్టు చేశాను. ఇందులో వేరే ఉద్దేశం లేదని సదరు అధికారి వివరణ ఇచ్చారు.