ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్ధిని ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : August 5, 2020 / 06:29 PM IST
ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్ధిని ఆత్మహత్య

కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపార సంస్దలు దాదాపు 2 నెలలపాటు పాక్షికంగా మూసి వేయబడ్డాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఒక్కోక్కటిగా మళ్లీ వ్యాపారాలు ప్రారంభించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ కూడ ఎత్తివేశారు. సినిమా హాళ్లు, విద్యాసంస్ధలు మినహా దాదాపు అన్నీసంస్ధలు పూర్తి స్ధాయిలో పని చేస్తున్నాయి.

ఈ సమయంలో విద్యార్దుల తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోయే పరిస్ధితి ఏర్పడింది. లాక్ డౌన్ సమయంలోనే పలు ప్రైవేటు విద్యా సంస్దలు తమ విద్యార్దుల కోసం ఆన్ లైన్ క్లాసులు మొదలెట్టాయి. ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవటం కోసం లాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు వినియోగం, వ్యాపారం బాగా పెరిగింది.

ఇంట్లో తల్లి తండ్రులు ఆన్ లైన్ క్లాసుల కోసం తమకు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని తోందరపాటుతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్దులు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని డెహాట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ తరగతుల కోసం తల్లి తండ్రులు స్మార్ట్‌ఫోన్‌ కొని ఇవ్వలేక పోవడంతో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లా పోమా గ్రామంలో నివసించే సామాన్య రైతుకు ఇద్దరు కుమార్తెలు.  తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాడు.   పెద్ద కుమార్తె 12 వ తరగతి చదువుతోంది. కరోనా వైరస్ కారణంగా స్కూళ్లు మూసి వేయటంతో ఇటీవల ఆమె చదివే స్కూలులో ఆన్ లైన్ క్లాసులు మొదలెట్టారు. ఇందుకోసం తనకు ఒక స్మార్ట్ ఫోన్ కొనివ్వమని ఆమె తల్లితండ్రులను కోరింది.

తండ్రి సామాన్య రైతు కావటంతో వెంటనే కొనివ్వలేక పోయాడు. గత గురువారం జులై 30 న ఆమె ఫోన్ విషయమై తల్లి తండ్రులతో గొడవ పడింది. కొన్నాళ్లు ఆగితే కొనిస్తామని తల్లి తండ్రులు చెప్పారు. ఆరోజు వారు పొలానికి పనికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పెద్ద కుమార్తె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

పొలం వద్ద ఉన్నవారికి చిన్న కుమార్తె సమాచారం ఇచ్చినట్లు తల్లి శశి యువనాటి చెప్పారు. హుటా హుటిన ఇంటికి వచ్చిన తల్లితండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. శనివారం డెహాట్ పోలీసులకు సమాచారం తెలియటంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.