అంకుల్ మా డాడీని కొట్టోద్దు… కార్పోరేటర్ భర్త దౌర్జన్యంపై చిన్నారి ఆవేదన

  • Published By: murthy ,Published On : July 15, 2020 / 12:32 PM IST
అంకుల్ మా డాడీని కొట్టోద్దు… కార్పోరేటర్ భర్త దౌర్జన్యంపై చిన్నారి ఆవేదన

నగరంలో కార్పోరేటర్ భర్త చేసిన దౌర్జన్యానికి ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. బాధితుడి భార్య మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయటంతో పోలీసులు స్పందించారు.

బోడుప్పల్ నగరపాలక సంస్ధ పరిధిలోని 27వ డివిజన్ కార్పోరేటర్ బందారం అంజలీ దేవి భర్త శ్రీధర్ గౌడ్ ఒక వ్యక్తిపై దౌర్జన్యం చేసి దారుణంగా కొట్టాడు.
బోడుప్పల్ ద్వారకా నగర్ ఫేజ్ 2 లో బి. పురందర్ రెడ్డి అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం బ్యాంకు ద్వారా ఒక ఇంటిని కొనుగోలు చేశాడు.

ఆ ఇల్లు తమ స్ధలంలో కట్టారని బందారం కుటుంబానికి చెందిన వ్యక్తులు తరచూ పురందర్ రెడ్డితో తగువు లాడేవారు. గత శుక్రవారం జులై 10వ తేదీన శ్రీధర్ గౌడ్ మరో 12 మంది కుటుంబ సభ్యులతో వచ్చి కర్రలతో శ్రీధర్ రెడ్డిపై దాడి చేశాడు. దాడి నుంచి తప్పించుకునేందుకు పురందర్ రెడ్డి ఇంటి మెయిన్ గేట్ కు తాళం వేశాడు. అయినా శ్రీధర్ గౌడ్ తన మనుషులతో గోడ దూకి వచ్చి తీవ్రంగా కొట్టారు.

ఆ దెబ్బలకు పురందర్ రెడ్డి అపస్మారక స్ధితిలోకి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను కేర్ ఆస్పత్రికి తరలించి స్ధానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్ధానిక పోలీసులు సరిగా స్పందించక పోయే సరికి పురందర్ రెడ్డి భార్య భానోదయ మంగళవారం దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలతో హెఆర్సీని ఆశ్రయించారు.

ఈలోగా శ్రీధర్ గౌడ్ దాడి చేస్తున్న విజువల్స్…అందులో పురందర్ రెడ్డి కుమారుడు అంకుల్ మా డాడీని కొట్టోద్దు అంటూ ఏడుస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవటంతో పాటు, కమీషన్ నోటీసులు అందటంతో పోలీసులు స్పందించారు. పురందర్ రెడ్డి భార్య ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు.

కార్పోరేటర్ భర్త బందారం శ్రీధర్ గౌడ్ తో పాటు బందారం నాగేశ్ గౌడ్, బుత్కూరి శ్రీరాములు, లక్ష్మణ్ గౌడ్, రామూ గౌడ్ అలియాస్ శ్రీనివాస్ , రాజ్ కుమార్ అలియాస్ రాజు, రాఘవేందర్ లపై కేసు నమోదు చేశారు. వీరిలో రాఘవేందర్ గౌడ్, రాము గౌడ్, రాజ్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న కార్పోరేటర్ భర్త శ్రీధర్ గౌడ్ తో సహ మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.