అమ్మవారి ఊరేగింపులో..సౌండ్ బాక్సులు మీద పడి ఇద్దరు చిన్నారులు మృతి

  • Published By: nagamani ,Published On : December 11, 2020 / 04:31 PM IST
అమ్మవారి ఊరేగింపులో..సౌండ్ బాక్సులు మీద పడి ఇద్దరు చిన్నారులు మృతి

UP :Shobhayatra sound system fall on two children killed : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బ‌దౌన్ జిల్లాలో జరిగే అమ్మవారి ఊరేగింపులో సౌండ్ బాక్సులు మీదప‌డి ఇద్ద‌రు చిన్నారులు మృతిచెందారు. బ‌దౌన్ జిల్లాలోని బ‌సై గ్రామంలో గురువారం (డిసెంబర్ 10,2020) రాత్రి అమ్మవారి సంబరాల్లో భాగంగా శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు.ఈ సంద‌ర్భంగా ఓ ట్రాక్ట‌ర్ ట్రాలీ సౌండ్ బాక్సులు ఏర్పాటు చేశారు.



ఈ ఊరేగింపు సంద‌ర్భంగా ఆ ట్రాక్ట‌ర్ ట్రాలీలో సౌండ్ బాక్సులు పక్కనే న‌లుగురు చిన్నారులు సౌండ్ బాక్సులో వచ్చే పాటలకు డ్యాన్స్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న సౌండ్ బాక్సులు ప్రమాదవశాత్తు ఆ నలుగురు చిన్నారులపై పడిపోయాయి.


ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు చిన్నారులకు తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు వారిని వెంటనే స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండగా 9ఏళ్ల బాలుడు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం డాక్టర్ల సూచ‌న మేర‌కు బ‌రేలీ ఆస్ప‌త్రికి త‌రలిస్తుండ‌గా మ‌రో తొమ్మిదేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగ‌తా ఇద్ద‌రు ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.


కాగా.. బ‌దౌన్ జిల్లా రూరల్ ఎస్పీ సిద్ధార్థ వర్మ మాట్లాడుతూ..అమ్మవారి శోభాయాత్రకు అనుమతి తీసుకోలేదని..ఈ సంఘటన జరిగిన తర్వాతే పోలీసులకు ఈ విషయం తెలిసిందని తెలిపారు. అనుమతి తీసుకుని ఉంటే పోలీసులు బందోబస్తు మధ్య జరిగే ఊరేగింపులో ఇటువంటి ఘటన జరిగి ఉండేది కాదని ఆశాభావం వ్యక్తంచేశారు.



ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని.. అనుమతి తీసుకోకుండా ఊరేగింపు నిర్వహించటం సరికాదని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.