జీవిత బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేసిన భార్య..8 ఏళ్ల తర్వాత అరెస్ట్

  • Published By: murthy ,Published On : December 3, 2020 / 11:52 PM IST
జీవిత బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేసిన భార్య..8 ఏళ్ల తర్వాత అరెస్ట్

Woman Arrested For Murdering Husband For Insurance Money: జీవిత బీమా పాలసీ చేయించటానికి వచ్చినప్పుడు.. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏమి చెప్తాడు…. సార్ మీరు ఇప్పుడు బాగున్నారు సార్… దురుదృష్టవశాత్తు ప్రమాదంలోనో.. మరో కారణంతోనో మరణిస్తే మీ కుటుంబానికి రక్షణ ఏది సార్…. అందుకే మీరు మీ జీవితాన్ని బీమా చేయించుకోండి సార్ అంటూ అభ్యర్దిస్తాడు. అనుకోని ఘటనలో మీరు మరణిస్తే మీ కుటుంబానికి లక్షల రూపాయల బీమా సొమ్ము అందుతుందని ఆశ చూపిస్తాడు. భర్త పేరుమీద ఉన్న కోటి రూపాయల బీమా సొమ్ము కోసం ఓ ఇల్లాలు ఏకంగా తాళి కట్టిన భర్తను హతమార్చింది. బీమా సొమ్ము క్లైయిమ్ చేసుకోవాలనుకున్న ఆమె ఆశ అడియాశలయ్యాయి. పోలీసులు కేసు తిరిగి విచారణ చేపట్టటంతో కధ మొదటికొచ్చింది.



మహారాష్ట్రలో ఎనిమిదేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. తాజాగా పోలీసులు మరోసారి విచారణ జరిపి నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో బభాలగాన్‌ సమీపంలోని గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నారావు బన్‌సోడే అనే వ్యక్తి మరణించాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఔస పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రోడ్డు ప్రమాదం జరిగినట్లు కేసు ఫైల్‌ చేసి విచారణ జరిపి ఫైల్ క్లోజ్ చేశారు.



అయితే భర్త పేరుపై ఉన్న కోటి రూపాయల బీమా సొమ్ము క్లైయిమ్ చేసుకోవటం కోసం అతడి భార్య జ్యోతి బన్‌సోడే ఇన్సూరెన్స్‌ కంపెనీకి వెళ్లింది. అవసరమైన కాగితాలు సమర్పించింది. బీమా కంపెనీ వారికి అనుమానం వచ్చి, ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. అది హత్య గా అనుమానించి పోలీసు కేసు నమోదు చేసారు. కాగా…. ఏప్రిల్‌ 28, 2014లో మృతుడి సోదరుడు భగవత్‌ బన్‌సోడే కూడా ఔస పోలీస్‌ స్టేషన్‌లో వదిన జ్యోతి బన్‌సోడేకి వ్యతిరేకంగా మరో ఫిర్యాదు చేశాడు. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసమే తన వదిన అన్నను హత్య చేసిందని, ఇందులో ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ వివేకి, అతని స్నేహితుడు సుబోధి హస్తం ఉన్నట్లు ఆరోపించాడు.



అయితే హత్య ఆరోపణలపై ఔస పోలీసులు జ్యోతి బన్‌సోడే పై కేసును నమోదు చేయలేదు. కాగా ….పోలీసు సూపరింటెండెంట్‌ నిఖిల్‌ పింగాలే ఆదేశాల మేరకు గత మూడు నెలలుగా ఈ కేసును పోలీసులు కొత్తగా విచారిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో ఔస కోర్టులో ఛార్జ్‌ షీట్‌ దాఖలవ్వగా సోమవారం జ్యోతి బన్‌సోడేను అరెస్ట్‌ చేశామని,వ్యక్తిగత పూచికత్తు పై ఆమెని విడుదల చేసినట్లు క్రైం బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌​ సునీల్‌ నాగార్‌గోజే తెలిపారు.