ప్రియురాలి కోసం భార్యను చంపాడు….అందరికీ సినిమా చూపించాడు

ప్రియురాలి కోసం భార్యను చంపాడు….అందరికీ సినిమా చూపించాడు

B.Tech student navya reddy murder case, husband remanded, SI reveals investigation,Khammam district : ప్రియురాలికోసం పెళ్ళాన్ని హత్య చేసి అందరికీ సినిమా చూపించిన ఖమ్మం జిల్లాకు చెందిన నాగశేషురెడ్డి కి పోలీసులు జైలు జీవితం ఎట్టా ఉంటుందో చూపిస్తున్నారు. పెళ్లికి ముందే మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న నాగశేషు రెడ్డి పెళ్లై 2 నెలలు తిరక్కుండానే భార్యను కాటికి పంపించాడు. పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుని…” సర్ 2 రోజులుగా నా భార్య కనిపించటంలేదు సార్, మీరే ఎలాగైనా వెదికి పెట్టాలని దీనంగా వేడుకున్నాడు”. అతడి నట విశ్వరూపం చూసి అందరూ నిజంగానే అతని భార్య నవ్యరెడ్డి కనిపించకుండా పోయిందనే అనుకున్నారు. అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందనుకున్నారే తప్ప నాగశేషురెడ్డిని ఎవరూ అనుమానించలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు నాగశేషురెడ్డి ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అతనికి అదే మండలం అయ్యవారి గూడెంకు చెందిన మరదలు వరసయ్యే బీటెక్ విద్యార్ధిని నవ్య రెడ్డితో(23) గతేడాది డిసెంబర్ 9న పెళ్లి జరిగింది. మరదలితో పెళ్లికి ముందు నుంచే నాగశేషు రెడ్డి తన గ్రామంలోని మరోక యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ విషయాన్నిదాచిపెట్టి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్న నవ్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్దిరోజులకే మరో మహిళ నుంచి తన భర్తకు ఫోన్ కాల్స్ రావటంతో, నవ్య భర్తను నిలదీసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భావించిన నాగశేషురెడ్డి భార్యను ఎలాగైనా అంతమొందించాలని డిసైడ్ అయ్యాడు. నవ్యరెడ్డి సత్తుపల్లి సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి2న భార్యను కాలేజీ వద్ద దింపివస్తానని చెప్పి స్కూటీపై తీసుకు వెళ్లిన నాగశేషు రెడ్డి తన పధకాన్ని అమలు చేశాడు.

మంగళవారం ఉదయం పెగళ్లపాడు నుంచి ఆమెను స్కూటీపై కళాశాలకి తీసుకెళ్లాడు. మార్గమధ్యలో నవ్యకు నిద్రమాత్రలు కలిపిన జ్యూస్‌ తాగించాడు. అది తాగిన నవ్య పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి కుక్కలగుట్ట సమీపంలోకి రాగానే అలసటగా ఉందని చెప్పింది. అయితే కాసేపు చెట్టు కింద విశ్రాంతి తీసుకుని వెళ్దామని చెప్పి కుక్కలగుట్ట పైకి తీసుకెళ్లాడు.

అక్కడ నవ్య మెడకు చున్ని వేసి బిగించి చెట్టుకు వేలాడ దీశాడు. నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ తాగటం చేత నవ్య దాదాపు అపస్మారక స్ధితికి చేరుకుంది. దీంతో నాగశేషురెడ్డి పని సులువైంది. భర్త చేసే పనికి ఎదురు చెప్పలేకపోయింది. అనంతరం ఆమె సెల్ ఫోన్ నుంచి తన మామకు వాట్సప్ ద్వారా మెసేజ్ చేశాడు. ‘నాకు ఇంజనీరింగ్‌లో కొన్ని సబ్జెక్టులు బ్యాక్‌లాగ్‌ ఉన్నాయి. సరిగ్గా చదువుకోలేకపోతున్నా. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా..’అని నవ్య రాసినట్టుగా మెసేజ్‌ పెట్టి పోన్ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు.

బుధవారం ఉదయం ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఏడుస్తూ తన భార్య కనిపించడం లేదని ఏడుస్తూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవ్య, నాగశేషురెడ్డి ఫోన్ల కాల్‌డేటా, లొకేషన్లను విశదీకరించారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం, కుప్పెనకుంట్ల గ్రామాల్లో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీల్లో నాగశేషురెడ్డి, నవ్య స్కూటీపై ఫిబ్రవరి 2న వెళ్తుండగా రికార్డు అయిన వీడియోలు, ఫొటోలను గుర్తించారు.

దీంతో నాగశేషురెడ్డిపై అనుమానం కలిగింది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. శుక్రవారం ఫిబ్రవరి5న పోలీసులు నవ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా….నవ్యరెడ్డి హత్య కేసు విచారణ జరుగుతుండగానే పెగళ్లపాడు గ్రామ సమీపంలో గూడూరు వినీల (20) అనే యువతి శుక్రవారం, ఫిబ్రవరి 5న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈమె బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. నవ్య హత్య కేసులో నిందితుడు నాగశేషురెడ్డికి   వినీల సమీప బంధువు కావడంతో ఈమె ఆత్మహత్య  పలు అనుమానాలకు తావిస్తోంది.

నవ్య హత్య కేసుకు సంబంధించిన వివరాల కోసం వినీలను పోలీసులు స్టేషన్ కు పిలిచి విచారించినట్లు తెలిసింది. అయితే ఆమె సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ భయంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవ్య హత్య కేసుకు, వినీల ఆత్మహత్యకు ఏమైనా సంబంధం ఉందా…..అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితుడు నాగశేషు రెడ్డిని మధిర కోర్టులో హజరు పరచి రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎర్రుపాలెం ఎస్సై తెలిపారు.