స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను స్టేషన్ లోనే దాచి అమ్ముకుంటున్న పోలీసులు..బండారాన్ని బైటపెట్టిన రోడ్డు ప్రమాదం..

స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను స్టేషన్ లోనే దాచి అమ్ముకుంటున్న పోలీసులు..బండారాన్ని బైటపెట్టిన రోడ్డు ప్రమాదం..

Gujarat police officials booked for hiding liquor bottles : అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. అలా స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ఏం చేస్తారు? అనే డౌట్ చాలామందికి చాలాసార్లు వస్తుంది. వాటిని ధ్వంసం చేస్తుంటారు. కానీ గుజరాత్ లో కొంతమంది పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను దాచేసుకున్న కక్కుర్తి ఓ రోడ్డు ప్రమాదం బైటపెట్టింది. రోడ్డు ప్రమాదమేంటీ..పోలీసుల కక్కుర్తిని బైటపెట్టటమేంటీ అనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే..

గుజరాత్ లోని అరవల్లి జిల్లాలోని మోడసాలో ఓ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ గత శుక్రవారం (ఫిబ్రవరి 19,2021)బైక్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్ల ఆ కానిస్టేబుల్స్ కు పెద్దగా గాయాలు ఏమీ కాలేదు వారి కక్కుర్తిని బైటపెట్టింది.

ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనంలో 120 మద్యం బాటిళ్లను తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో వారికి పెద్దగా గాయాలు కాలేదు గానీ వాహనంలో వారు పట్టుకెళుతున్న మద్యం బాటిళ్లు పగిలిపోయాయి. దీంతో ఆ రోడ్డంతా మద్యం ప్రవహించింది. ఇది తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ప్రమాదం జరగటం గురించి పక్కన పెడితే..అసలు ఆ మద్యం బాటిళ్లు ఎక్కడివన్నదాని గురించి ఆరా తీశారు. దీంతో ఓ షాకింగ్ నిజం తెలిసింది.

ఇటీవల అక్రమంగా మద్యం తీసుకెళ్తున్న ఓ ట్రక్కును క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేశారు. అందులోంచి పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లలోని సగానికి పైగా బాటిల్స్ ను అదే స్టేషన్ లో పనిచేసే ముగ్గురు కానిస్టేబుళ్ల సాయంతో ఇన్ స్పెక్టర్ పోలీస్ స్టేషన్లోనే దాచిపెట్టారు.

అలా దాచిన బాటిళ్లను విడతల వారీగా బయటకు చేరవేసి అమ్ముకునేవారు. అలా గత శుక్రవారం మద్యం బాటిల్స్ ను తరలిస్తుండగా..వారి బ్యాడ్ టైమ్ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదం ఈ పోలీసులు బాగోతాన్ని బయట పెట్టింది. దీంతో శనివారం (ఫిబ్రవరి 21) ఆ నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసామని ఎస్పీ ఖారత్ తెలిపారు. అదన్న మాట మోసాలు ఎల్లకాలం సాగవు..టైమ్ వస్తే బైటపడాకా మానవు..పరువు తీయకా మానవు.