విడాకులివ్వ‌కుండానే..నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న గవర్నమెంట్ టీచర్

విడాకులివ్వ‌కుండానే..నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న గవర్నమెంట్ టీచర్

odisha govt school teacher 4 Marriages :గవర్నమెంట్ టీచర్ అయి ఉండీ ఏమాత్రం బాధ్యతలేకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. గవర్నమెంట్ జీతం తీసుకుంటు గవర్నమెంట్ చేసిన చట్టాలనే లెక్కచేయలేదు.మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్యా, రెండవ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నిత్యపెళ్లిళ్లు టీచర్ గురించి వెలుగులోకి వచ్చింది.

ఒడిశాలోని క‌ట‌క్ జిల్లాలోని మౌజా ప్రాంతానికి చెందిన కృష్ణ చంద్ర నాయక్ కు 45 ఏళ్లు. ప్ర‌భుత్వ స్కూల్లో టీచ‌ర్ గా పనిచేస్తున్నాడు‌. కృష్ణ చంద్ర నాయక్ మొదటిసారి 2001లో వివాహ‌మైంది. ఆమెతో సంసారం చేస్తూనే.. 2009లో మ‌రో పెళ్లి చేసుకున్నాడు. ఈ విష‌యం మొద‌టి భార్య‌కు తెలియ‌కుండా జాగ్రత్త పడ్డాడు. రెండో భార్య‌తో మూడేళ్లు కాపురం చేశాడు. ఆతరువాత ఆమె దగ్గరున్న బంగారం, వెండి వంటి ఖరీదైన వస్తువుల్ని తీసుకుని ఉడాయించాడు.

ఇంతలో కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ వచ్చింది. ఈ లాక్ డౌన్ లో కూడా కృష్ణ చంద్ర నాయక్ ఏమాత్రం ఖాళీగా లేడు. మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. రెండో భార్య సంగతి అసలే లేదు. కానీ మరో రెండు పెళ్లిళ్లు చేసుకుని జల్సాలు చేస్తున్నాడు.

అతనికి ముందు మూడు పెళ్లిళ్లు అయినట్లుగా నాలుగో భార్యకు తెలీదు. అలా ఒకరికి మరొకరు తెలియలేదు. అంత బాగా మ్యానేజ్ చేశాడు కృష్ణ చంద్ర నాయక్. మొత్తానికి ఆ న‌లుగురిని అలా మెయింటెన్ చేశాడు టీచ‌ర్‌. కానీ చేసిన తప్పులు ఎంత కాలం దాగుతాయి. నాలుగో భార్య దగ్గర ఉండగా మూడో భార్యకు విషయం తెలిసింది. అలా మొత్తం గుట్టు రట్టు అయ్యింది.

త‌మ భ‌ర్త లాక్‌డౌన్‌లో మ‌రో ఇద్ద‌రిని వివాహం చేసుకున్నాడ‌ని మొద‌టి ఇద్ద‌రు భార్య‌లు తెలుసుకున్నారు. దీంతో వారు క‌ట‌క్‌లోని మ‌హిళా పోలీసు స్టేష‌న్‌లో గ‌త నెల‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు టీచ‌ర్‌ను శుక్ర‌వారం (ఫిబ్రవరి 19,2021) టీచర్ కృష్ణ చంద్ర నాయక్ అరెస్టు చేశారు.

రెండో భార్య దగ్గరనుంచి ఎత్తుకెళ్లిన బంగారు, వెండి ఆభ‌ర‌ణాలు, ఇత‌ర ఖ‌రీదైన వ‌స్తువుల‌ను తిరిగి ఇప్పించారు. అలా ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహాలు చేసుకుని జల్సాలు చేస్తున్న కృష్ణ చంద్ర నాయక్ పై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు కటక్ పోలీసులు..