సీఐ శంకరయ్య ఆస్తులు రూ.40 కోట్ల పైమాటే ?

సీఐ శంకరయ్య ఆస్తులు రూ.40 కోట్ల పైమాటే ?

జయరాం అనే వ్యక్తి వద్దనుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన షాబాద్ సీఐ ఆస్తులు తవ్వే కొద్ది వెలుగు చూస్తున్నాయి. రూ.4 కోట్ల రూపాయలు ఉండొచ్చు అనుకున్న ఆస్తులు సోదాల్లో రూ.40 కోట్లకు చేరుతున్నట్లు సమాచారం. శంకరయ్య ఇంట్లో జరుగుతున్న సోదాల్లో కీలక సమచారం వెల్లడవుతోంది.

శంకరయ్య భారీ స్ధాయిలో కూడబెట్టిన ఆస్తులను అధికారులు గుర్తిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు నిందితుడు రాకేష్ రెడ్డితోనూ శంకరయ్యకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

గతంలో దుండిగల్‌ సీఐగా పనిచేస్తున్న సమయంలో శంకరయ్యకు రాకేశ్‌రెడ్డితో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి వారి మధ్య లావాదేవీలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఇక జయరాం, శిఖ చౌదరీల కాల్‌ డేటాను సీఐ శంకరయ్య ద్వారానే రాకేష్‌రెడ్డి రాబట్టినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.

ఇప్పటి వరకు సీఐ శంకరయ్య, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ సాగించిన సోదాల్లో బయటపడిన ఆస్తుల వివరాలు :

> ఒక కోటి 5 లక్షల విలువ చేసే రెండు ఇళ్లు,
> రెండు కోట్ల 28 ల‌క్షల రూపాయలు విలువ‌చేసే 11 ఇంటి ప్లాట్స్,
> 77 ల‌క్షల రూపాయలు విలువ‌చేసే 41 ఎక‌రాల 3 గుంట‌ల వ్య‌వ‌సాయ భూమి నిజామాద్, చేవెళ్ల‌, మిర్యాల గూడ‌లో ఉన్న‌ట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

> 7 ల‌క్ష‌ల విలువ చేసే మారుతి స్విప్ట్ కారు,
> 21 లక్ష‌ల విలువ చేసే బంగారు ఆభ‌ర‌ణాలు,
> 17 ల‌క్ష‌ల 88 వేల‌ న‌గ‌దు,
> 6 ల‌క్షల విలువ చేసే ఇత‌ర వ‌స్తువులు,
> 81 వేల వెండి వ‌స్తువుల‌ను ఏసీబీ అధికారులు గుర్తించారు.

సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌ లకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Read Here>>తెలంగాణలో మరో డేరా బాబా…మహిళపై లైంగిక దాడి