తూ.గో. జిల్లా పోలీస్ శాఖలో కలకలం రేపుతున్న సస్పెన్షన్లు

  • Published By: murthy ,Published On : July 27, 2020 / 07:19 PM IST
తూ.గో. జిల్లా పోలీస్ శాఖలో కలకలం రేపుతున్న సస్పెన్షన్లు

తూర్పుగోదావరి జిల్లాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్ల సస్పెషన్లు పోలీస్‌శాఖలో కలకలం రేపుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి కొందరు.. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం మరికొందరు చేస్తోన్న ఓవరాక్షన్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో ఏకంగా ఆరుగురు ఎస్సైలు సస్పెన్షన్‌కు గురికావడం జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ప్రశ్నార్థకంగా మారింది. సంచలన కేసుల్లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న ఉన్నతాధికారులను చూసి.. క్షేత్రస్థాయి సిబ్బందిలో అవినీతి పెచ్చుమీరుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుశాఖ పనితీరు చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ మాట ఎలాగున్నా.. కొన్ని కేసుల్లో కొంతమంది ఖాకీలు వ్యవహరిస్తోన్న తీరు… అటు న్యాయస్థానాలకు.. ఇటు ఉన్నతాధికారులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. దీంతో న్యాయస్థానం ఆగ్రహంతో కొంతమంది.. శాఖాపరమైన విచారణతో కొంతమంది పోలీసులపై వేటు పడుతోంది. గడిచిన నెల రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా ఆరుగురు ఎస్సైలు సస్పెన్షన్‌కు గురికావడం.. పోలీస్‌శాఖ పనితీరుపై అనుమానాలు కలగచేస్తోంది.

సీతానగరం మండలం మునికూడలి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అధికారపార్టీ నాయకుడు, దళిత యువకుడికి మధ్య తలెత్తిన వివాదం ఎస్సై మెడకు చుట్టుకుంది. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రసాద్‌ అనే దళిత యువకుడిని స్టేషన్‌ను పిలిపించిన ఎస్సై ఫిరోజ్‌.. అందరి సమక్షంలో శిరోముండనం చేయించాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచనంగా మారడంతో… ఎస్సై ఫిరోజ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. అంతేకాదు.. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంకింద అరెస్టయి.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.

న్యాయవాది సుభాష్‌ చంద్రబోస్‌ విషయంలోనూ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. లాయర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ను ఏలేశ్వరం ఎస్సై సుధాకర్‌, రాజమహేంద్రవరం త్రీటౌన్‌ ఎస్సై హరిబాబు అర్థరాత్రి అరెస్ట్‌ చేశారు. ఇద్దరు ఎస్సైలు కూడా కనీసం మహిళా కానిస్టేబుల్‌ను కూడా వెంట తీసుకెళ్లకుండా… సుభాష్ కుటుంబంలోని మహిళలపై దురుసుగా ప్రవర్తించారు.

అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లతో టీడీపీకి చెందిన సుభాష్‌ చంద్రబోస్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేయడంతోపాటు… ఎక్కడ ఉంచారనే సమాచారం కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. దీంతో సుభాష్‌ ప్యామిలీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఏకంగా ఎస్పీ నయామ్‌ అద్నాన్‌ హష్మి వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. ఈ కేసులో ఎస్సైలు ఇద్దరు ప్రవర్తించిన తీరును హైకోర్టు తప్పుపట్టడంతో.. వారిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

సంచలన కేసుల్లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న ఉన్నతాధికారులను చూసి క్షేత్రస్థాయి సిబ్బంది సైతం అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల కాలంలో సస్పెన్షన్లకు గురైనా ఎస్సైల జాబితానే నిదర్శనం.

నెల రోజుల క్రితం జాతీయ రహదారిపై కల్తీ ఆయిల్‌ ట్యాంకర్‌ను పట్టుకున్న గండేపల్లి ఎస్సై తిరుపతిరావు… వారి నుంచి డబ్బులు వసూలు చేసి… కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టారు. అదే ట్యాంకర్‌ మరలా పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు దగ్గర అక్కడి ఎస్పీకి చిక్కింది. దీంతో విచారణ జరుపగా.. ఎస్సై తిరుపతిరావు అవినీతి బయటపడింది. వెంటనే ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్‌ చేశారు.

ఇక ఇటీవల సీతానగరం మండలంలో హల్‌చల్‌ చేసిన నకిలీ డీఎస్పీ కేసులో… ఎస్సై ఆనంద్‌కుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. కోవిడ్‌ నిబంధనలను సాకుగా చూపి.. వ్యాపారుల నుంచి నకిలీ డీఎస్పీ చేసిన వసూళ్ల వెనుక ఎస్సై ఆనంద్‌కుమార్‌ హస్తం ఉన్నట్టు పోలీసు విచారణలో తేలింది.

జిల్లాలోని పోలీసు అధికారులు.. కాసులకు కక్కుర్తిపడి కొందరు.. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం మరికొందరు.. తమ విధులు మరిచి ప్రవర్తిస్తున్నారు. దీంతో సస్పెన్షన్లకు గురవుతూ పోలీస్‌శాఖకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు. కొంతమంది చేస్తోన్న పనులతో ప్రజల్లో పోలీసులు అంటేనే చులకన భావం ఏర్పడుతోంది. మరి తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుశాఖ ఎలా గాడిలో పడుతుందో చూడాలి.