45 రోజుల పసిపాపని ఆకలితో మాడ్చి విషమిచ్చి చంపేసిన తల్లిదండ్రులు

45 రోజుల పసిపాపని ఆకలితో మాడ్చి విషమిచ్చి చంపేసిన తల్లిదండ్రులు

45 days girl child killed by parents : ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆడపిల్ల అనే వివక్ష పోవటంలేదు. కన్న పేగు బంధాన్ని కూడా కసాయిగా చిదిమేస్తున్నారు. రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టిందని 45 రోజుల పసికందుకు పాలు పట్టకుండా కన్న తల్లిదండ్రులే ఆకలితో మాడ్చి..విషమిచ్చి చంపేసిన అమానవీయ ఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో జరిగింది.

కన్నబిడ్డలైనా వారి ప్రాణాలు తీసే హక్కు ఎవ్వరికీ లేదు.కానీ మగపిల్లాడు పుట్టలేదని అసంతృప్తితో నెలన్నర రోజుల పసిగుడ్డుకు పాలు పట్టకుండా..విషమిచ్చి చంపేయటం అత్యంత అమానవీయం. అటువంటి దారుణానికి పాల్పడిన ఆ తల్లిదండ్రులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.

పసిబిడ్డను పొట్టన పెట్టుకున్న తల్లిదండ్రులకు కఠిన శిక్ష పడింది. మగ సంతానం కావాలనే ఆశతో ఆడ శిశువుకు విషమిచ్చి కర్కశంగా హతమార్చిన కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని మూడు సంవత్సరాలు శ్రమపడి కోర్టులో కఠిన శిక్ష పడేలా చేసిన ఘటన తెలంగాణాలోని నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధిలోని పడమటితండాలో చోటుచేసుకుంది.

పడమటితండాకు చెందిన రమావత్‌ జయరాం, నాగమణి దంపతులు. వారికి మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. రెండవసారి నాగమణి గర్భం దాల్చింది. మగపిల్లాడు పుట్టాలని ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు. కానీ రెండో సారి కూడా ఆడపిల్లే పుట్టటంతో రమావత్ దంపతులు అసంతృప్తితో ఉన్నారు.దాంతోనే పసిబిడ్డకు నాగమణి పాలు కూడా పట్టేది కాదు. ఆకలితో బిడ్డ గుక్కపట్టి ఏడుస్తున్నా ఆ తల్లికి కనికరం కలగలేదు. బిడ్డ ఏడ్చిందంటే తల్లి గుండెలో అవిసిపోతాయి. వెంటనే అక్కున చేర్కుకుని బిడ్డ కడుపు నింపేదాకా ఆ తల్లి మనస్సు శాంతించదు. అటువంటిది కడుపుడు ఆకలితో పసిబిడ్డ ఏడుస్తున్నా నాగమణి కఠిన గుండె కరగలేదు. అలా ఏడ్చి ఏడ్చి ఆ బిడ్డ సొమ్మసిల్లి పోయినా పట్టించుకునేది కాదు.

అలా ఆ పసిబిడ్డకు పాలు ఇవ్వకుండా, బాగోగులు చూడకపోవడంతో అనారోగ్యంపాలైంది. ఈ విషయం చుట్టు పక్కలవారి ద్వారా తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు రమావత్ కు, నాగమణిలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా వారి తీరు ఏమాత్రం మారలేదు. దీంతో అదికారులు ఆ బిడ్డ ఆకలితో చచ్చిపోతుందనే ఉద్ధేశ్యంతో నల్లగొండ శిశుగృహకు శిశువును తరలించే యత్నించారు. కానీ రమావత్ దంపతులు ఒప్పుకోలేదు. మా బిడ్డను ఇకనుంచి బాగా చూసుకుంటామని నమ్మించారు. కానీ వారి తీరు పెద్దగా మారలేదు.

ఈ క్రమంలో 2017 ఫిబ్రవరి 4న 45 రోజుల పాప అనారోగ్యానికి గురైంద‌ని స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చూపించారు. కానీ పరిస్థితి బాగుండకపోవటంతో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ పసిపాప అప్పటికే చనిపోయింది. దీంతో వారి గురించి తెలిసిన వారిపై అనుమానం వచ్చిన అప్పటి ఐసీడీఎస్‌ సీడీపీఓ సక్కుబాయి, అప్పుడు ఎస్‌ఐ గా పనిచేస్తున్న రాఘవేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..పసిబిడ్డను ఆకలితో మాడ్చినట్లుగా తేలింది. తరువాత పసిబిడ్డకు పోస్టుమార్టం చేయించగా మరో షాకింగ్ విషయం బైటపడింది. 45 రోజుల పసిబిడ్డకు విషప్రయోగం జరిగిందని రిపోర్టులో తేలింది.

దీంతో వారిపై 302, 109 సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి..అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 45 రోజులు రిమాండ్‌ లోనే ఉన్నారు. వారిపై చార్జిషీట్‌ వేసి..కేసును ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ మరియు సెషెన్స్‌ కోర్టు నల్లగొండలో విచారణ జరిపారు. దంపతులు బిడ్డను ఆకలితో మాడ్చి పైగా విషం ఇచ్చి చంపినట్లుగా నేరం రుజువైంది. దీంతో గురువారం (జనవరి 11,2021) యావజ్జీవ కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధించారు. కేసును సవాల్‌గా తీసుకుని శిక్ష పడేలా చేసిన అప్పటి దర్యాప్తు అధికారులు సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి, ప్రస్తుత ఎస్‌ఐ గోపాల్‌రావు, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌ రవీందర్‌ రాథోడ్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జవహర్‌ను దేవరకొండ డీఎస్పీ ఆనందర్‌రెడ్డి అభినందించారు.