ఉగ్రవాదులకు షాక్ : 24 గంటల్లో 109 మంది హతం

  • Published By: chvmurthy ,Published On : December 24, 2019 / 09:40 AM IST
ఉగ్రవాదులకు షాక్ : 24 గంటల్లో 109 మంది హతం

ఆప్ఘనిస్తాన్ లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గత 24 గంటల్లో 18 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చారు. 15 ప్రావిన్సులలో చేపట్టిన ఉగ్రవాద ఏరివేతలో 109 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆఫ్ఘాన్ ప్రభుత్వం మంగళవారం ప్రకటిచింది. మరో 45 మంది ఉగ్రవాదులు గాయపడ్డారు.  ఐదుగురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. 

‘గత 24 గంటల్లో, దేశంలోని 15 ప్రావిన్సులలో మేము 18 ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్లు చేపట్టాము. అందులో 109 ఉగ్రవాదులు మృతి చెందారు. మరో 45 ఉగ్రవాదులు గాయపడ్డారు. ఐదుగురు టెరరిస్టులను కూడా మా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి’ అని అఫ్ఘానిస్థాన్‌  రక్షణ శాఖ ట్వీట్ చేసింది. అయితే ఈ టెర్రరిస్టులందరూ ఒకే ఉగ్రవాద సంస్థకు చెందిన వారా కాదా అనేది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.

కపిసా ప్రావిన్స్‌లోని నిజ్రాబ్‌ జిల్లాలో ఆఫ్ఘాన్ ఆర్మీ జరిపిన దాడుల్లో 9 మంది తాలిబన్లు హతమైనట్లు రక్షణశాఖ తెలిపింది. ఇక్కడి నాలుగు ప్రధాన ఉగ్ర శిబిరాలను కూడా భద్రతాబలగాలు ధ్వంసం చేసారు. ఇక లఘ్‌మన్‌లోని అలి షెయింగ్‌ జిల్లాలో జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. లోగర్‌లోని మహ్మద్‌ అఘా జిల్లాలో జరిపిన దాడుల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వారి ఆయుధ గోడౌన్ కూడా ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.