మోడీకి లేఖ రాసి…దేశంలోని పరిస్థితులపై మనస్థాపం చెందిన 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య

  • Published By: venkaiahnaidu ,Published On : August 19, 2020 / 03:57 PM IST
మోడీకి లేఖ రాసి…దేశంలోని పరిస్థితులపై మనస్థాపం చెందిన 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య

దేశంలో తాజా పరిస్థితులపై మనస్థాపం చెందిన ఓ 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని.. అవినీతి రాజ్యమేలుతోందన్న కారణంతో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రధాని మోడీకి ఆ బాలిక 18 పేజీల లేఖను రాసింది. ఆగస్టు 14న ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఆత్మహత్య ఘటనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.



ఉత్తరప్రదేశ్ లోని సంబల్‌కు చెందిన 16 ఏళ్ళ బాలిక… బాబ్రాల ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతోంది. తన వయసు చిన్నదయినా దేశభక్తి ఎక్కువే. పర్యావరణంపైనా ఎంతో ప్రేమ కలిగి ఉండేది. మనదేశంలో అవినీతి, కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందన్న మనస్థాపంతో తుపాకీతో కాల్చుకొని మరణించింది. ప్రధాని మోడీకి రాసిన సూసైడ్ లేఖలో పలు అంశాలను వివరించింది ఆ బాలిక.



రసాయన రంగులతో హోలీ ఆడుతున్నారని.. వాటి వల్ల పర్యావరణంతో పాటు మనుషుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. అనేక చోట్ల చెట్లను నరుకుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని,అయినా పాలకులకు పట్టడం లేదని వాపోయింది. దీపావళి సందర్భంగా కాలుష్యం పెరిగిపోతోందని.. బాణాసంచాపై నిషేధం విధించాలని ప్రధానిని కోరింది.



అంతేకాకుండా, ఈ సమాజలో వృద్ధులను చిన్నచూపు చూస్తున్నారని.. కన్నపిల్లలే వారిని అనాథాశ్రమాల్లో చేర్చుతున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఇలాంటి చోట తాను ఇక ఒక్కక్షణం కూడా బతకలేనని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మహత్య చేసుకుంది ఆ బాలిక. ఈ అంశాలపై మాట్లాడేందుకు ప్రధాని మోదీని కలవానుకున్నానని.. కానీ అది సాధ్యం కాలేదని ఆ లేఖలో తెలిపింది.