భారీ వర్షాలు…నాలుగు ఇళ్లు కూలి 17మంది మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : December 2, 2019 / 11:03 AM IST
భారీ వర్షాలు…నాలుగు ఇళ్లు కూలి 17మంది మృతి

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో నాడుర్ గ్రామంలో  నాలుగుఇళ్లు కూలి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఒక గ్రామంలో సోమవారం ఉదయం 5గంటల సమయంలో వరుస ఇళ్లపై గోడ కూలి 11 మంది మహిళలు, ముగ్గురు పిల్లలతో సహా 17 మంది నిద్రలో మృతి చెందారని పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా పూర్తిగా తడిసిన 15 అడుగుల ఎత్తైన ప్రైవేట్ కాంపౌండ్ గోడలో కొంత భాగం ప్రక్కనే ఉన్న టైల్డ్-రూఫ్ ఇళ్లపై పడిందని తెలిపారు.  మరికొంతమంది శిధిలాల కింద ఉన్నారని సమాచారం. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం పళనిస్వామి.

రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలతో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తిరువల్లూర్, వెల్లూర్, తిరువన్నమలై, తూత్తుకూడి, రామనాథపురం, తిరునెల్వేలి జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. భారీవర్షాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చెన్నై నగరంలోని షోజింగానల్లూర్, పల్లవరం, తంబారం, నన్ మంగళం, సెలియాయూర్ ప్రాంతాల్లో వరదనీరు నిలచింది. చెన్నై నగర శివార్లలో వంద గృహాలు నీటమునిగాయి. కడలూరు, నాగపట్నం, తూత్తుకూడి జిల్లాల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కడలూరులో 5వేల ఇళ్లు నీట మునగడంతో వరద బాధితులను ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు. 

5వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగి దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీవర్షాల వల్ల నదుల్లో నీటిమట్టం గణనీయంగా పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ తమిళనాడు సర్కారును అప్రమత్తం చేసింది. చెంబరంక్కం, పూండీ సత్యమూర్తి, రెడ్ హిల్స్, చోళవరం రిజర్వాయర్లు వరదనీటితో నిండిపోయాయి. వరదల కారణంగా రబ్బరు బోట్లను అధికారులు సిద్ధంగా ఉంచారు. 331 మంది అగ్నిమాపకశాఖ కేంద్రాల్లో ఉద్యోగులు, 22 మంది కమెండోలను రంగంలోకి దించి సహాయ చర్యలు చేపట్టారు. తమిళనాడు,పుదుచ్చేరిలోని మత్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణశాఖ సూచించింది.