కోర్టు రూంలో ఖైదీపై కాల్పులు: 18 మంది పోలీసులు సస్పెండ్!

  • Published By: sreehari ,Published On : December 18, 2019 / 10:12 AM IST
కోర్టు రూంలో ఖైదీపై కాల్పులు: 18 మంది పోలీసులు సస్పెండ్!

యూపీలోని కోర్టుకు హాజరైన హత్య కేసు నిందితుడి కాల్పుల కేసులో 18మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నోర్ కోర్టు రూంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులను హత్యచేసిన కేసులో నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. కోర్టులోకి ప్రవేశించిన నిందితుడిని మరో ముగ్గురు తుపాకీలతో కాల్చి చంపేశారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు, కోర్టు సిబ్బందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 

షహన్వాజ్ అన్సారీ అనే ఖైదీని బిజ్ నోర్ జిల్లా కోర్టులో చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే క్రమంలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. వెంటనే ఆ ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఛేజ్ చేసి చివరికి అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా కోర్టులోకి తుపాకీలు తీసుకురావడమే కాకుండా విచారణ ఖైదీపై కాల్పలు జరపడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. పోలీసుల నిర్లక్ష్యంతో ఇలాంటి కాల్పుల ఘటనకు దారితీసిందనే కారణంతో 18మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. 

కోర్టు రూంలో కాల్పులు జరిగిన సమయంలో జడ్జీ, ఇతర కోర్టు సిబ్బంది అక్కడే ఉన్నట్టు నివేదికలు తెలిపాయి. ఘటన సమయంలో కోర్టులోనే ఉన్న న్యాయవాది మాట్లాడుతూ.. కాల్పులు జరుపుతున్నంతసేపు ప్రతిఒక్కరూ నేలపై పడుకునిపోయినట్టు తెలిపారు. ‘నేను కోర్టు రూంలోనే ఉన్నాను. నా క్లయింట్ ఒకరిది బెయిల్ పిటిషన్ ఉంది. ఆకస్మాత్తుగా ముగ్గురు వచ్చి కాల్పులు జరిపారు. 

భయంతో దాచుకున్నాం. నేలపై ఒక వ్యక్తి పడి ఉండటానికి చూశాను. ఒక పోలీసు బుల్లెట్ తీసుకోవడం కూడా చూశాను. పోలీసులు వచ్చి మమ్మల్ని రక్షించేంతవరకు అలానే నేలపై పడికుని ఉండిపోయాం. నాకు అదంతా ఓ సినిమా సీన్ లా అనిపించింది’ అని న్యాయవాది అతుల్ సిసోడియా తెలిపారు. షహన్వాజ్ అన్సారీ.. ఓ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన కేసులో నిందితుడు.