నిజం నిప్పులాంటిది : కొడుకును చంపిన తల్లి బండారం 18 ఏళ్లకు బట్టబయలు

  • Published By: madhu ,Published On : April 8, 2019 / 03:32 AM IST
నిజం నిప్పులాంటిది : కొడుకును చంపిన తల్లి బండారం 18 ఏళ్లకు బట్టబయలు

అందుకే అన్నారు నిజం నిప్పులాంటిది అని పెద్దలు ఊరికే అనలేదు. సొంత కొడుకుని హత్య చేయించిన తల్లి ఘాతుకం 18 ఏళ్ల తర్వాత బయటపడింది. నేరం రుజువు అయ్యింది. తల్లినే నిందితురాలిగా నిర్ధారించారు. కేసులో ముగ్గురు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ప్రధాన సూత్రధారిగా అయిన హతుడి తల్లి పరారీలో ఉన్నట్లు ప్రకటించారు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్. తల్లి.. పాత్రధారులైన బంధువులు, స్నేహితులు ఇన్నేళ్లు స్వేచ్చగా తిరిగారు. 

హైదరాబాద్ సిటీ హష్మాబాద్‌కు చెందిన మసూదా, మహ్మద్ సాబ్ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు. మహ్మద్ సాబ్ చనిపోవడంతో మసూదా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. ఆడపిల్లలకు పెళ్లి చేయడంతో పాటు మగ పిల్లలను స్థిరంగా నిలదొక్కొనేలా చేసింది. అయితే రెండో కుమారుడు మహ్మద్ ఖాజా మాత్రం చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు కోసం తల్లితో పాటు కుటుంబసభ్యులను వేధించేవాడు. కుమారుడి వేధింపులు భరించలేక కుటుంబం హష్మాబాద్ నుంచి జుబైల్ కాలనీకి మకాం మార్చింది.

అయినా వేధింపులకు దిగేవాడు ఖాజా. డబ్బులివ్వకపోతే హష్మాబాద్‌లో ఉన్న ఇంటిని అమ్మేస్తానని బెదిరించేవాడు. నిత్యం ఘర్షణలతో మసూదా తీవ్ర ఆవేదనకు గురయ్యేది. చివరకు ఇతడిని అడ్డు తొలగించుకోవాలని తల్లి మసూదా నిర్ణయించుకుంది. అల్లుళ్ల సాయం కోరింది. ఖాజా స్నేహితుడు సయ్యద్ హషమ్‌తో.. అలుళ్లతో చర్చలు జరిపింది. ఖాజాను అంతం చేస్తే పీడ విరగడ అవుతుందని ఫైనల్‌గా డిసైడ్ అయ్యారు. 

2001 జూన్ 4న ఖాజాకు కల్లు ఆశ చూపిన వాళ్లు.. బండ్లగూడకు తీసుకెళ్లారు. అక్కడ కల్లు కాంపౌండ్‌లో మద్యం సేవించారు. ఖాజాను శాస్త్రీపురంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అదును చూసి రాళ్లతో కొట్టి చంపేశారు. శవాన్ని అక్కడే వదిలేసి మసూదాకి విషయం చెప్పారు. ఖాజా శవాన్ని పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడని రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఎలాంటి క్లూ లభించలేదు. కొలిక్కిరాని కేసుగా భావించిన పోలీసులు కేసును మూసివేశారు.

అయితే.. మసూదా ఇంట్లో ఇటీవలే చిన్నపాటి గొడవ జరిగింది. అల్లుళ్లతో వాగ్వాదం జరగడం.. ఖాజాను చంపిన విషయం బయటకు చెప్పలేదని వారు నోరు జారారు. ఈ విషయం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసులు లోతుగా ఆరా తీశారు. కుటుంబ సభ్యుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటకు పొక్కింది. 2010లో రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ నుంచి వేరుగా మైలార్ దేవులపల్లి పీఎస్‌గా ఏర్పడింది. ఈ కేసును వారికి అప్పగించారు. పరారీలో ఉన్న మసూదా కోసం గాలిస్తున్నారు.