2008 జైపూర్ పేలుళ్ల కేసు…నలుగురికి మరణశిక్ష

  • Published By: venkaiahnaidu ,Published On : December 20, 2019 / 11:46 AM IST
2008 జైపూర్ పేలుళ్ల కేసు…నలుగురికి మరణశిక్ష

2008 జైపూర్ పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఇవాళ(డిసెంబర్-20,2019) మరణశిక్ష విధించింది జైపూర్ లోని ప్రత్యేక న్యాయస్థానం. 2008 జైపూర్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్‌ న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొకరిని నిర్దోషిగా ప్రకటించింది. దోషులుగా తేలిని మొహమ్మద్ సైఫ్,సర్వార్ ఆజ్మీ,సల్మాన్, సైఫుర్ రెహ్మాన్ లకు ఇవాళ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

2008లో జైపూర్‌లో ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ఉగ్రవాద సంస్థ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ దాడిలో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోగా  మరో 170 మందికి పైగా గాయపడ్డారు.2008 మేలో హవా మహల్‌ దగ్గర మొదట పేలుడు సంభవించింది. సుమారు ఏడు చోట్ల ఉగ్రవాదులు బాంబు దాడులకు దిగారు. సాయంత్రం 7:20గంటల నుంచి సాయంత్రం 7:45గంటల సమయం మధ్యలో ఈ పేలుళ్లు జరిగాయి.

2 కిలోమీటర్ల వ్యాసార్ధంలో, 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఎక్కువ పేలుళ్లు హనుమాన్‌ ఆలయాల వద్దే జరిగాయి. 12ఏళ్ల పాటు కొనసాగిన విచారణ అనంతరం జైపూర్‌ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు ఇవాళ వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ బాంబు దాడికి పాల్పడిన మరో ఇద్దరిని 2008లోనే ఎన్‌కౌంటర్‌ చేశారు.