ఇంటర్‌లో ఫెయిల్ అయ్యామని ముగ్గురు, మార్కులు తక్కువ వచ్చాయని ఇద్దరు ఆత్మహత్య

తెలంగాణలో ఇటీవలే ఇంటర్ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలు విద్యార్థుల పాలిట

  • Published By: naveen ,Published On : June 20, 2020 / 02:47 AM IST
ఇంటర్‌లో ఫెయిల్ అయ్యామని ముగ్గురు, మార్కులు తక్కువ వచ్చాయని ఇద్దరు ఆత్మహత్య

తెలంగాణలో ఇటీవలే ఇంటర్ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలు విద్యార్థుల పాలిట

తెలంగాణలో ఇటీవలే ఇంటర్ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు విద్యార్థుల పాలిట మరణశాసనంగా మారుతున్నాయి. రిజల్స్ట్ ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నాయి. కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా ఇంటర్ ఫలితాల సమయంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మార్కుల ఒత్తిడి వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని, ఫస్ట్ ర్యాంకులు, మార్కులే జీవితం కాదని సైకాలజిస్టులు, మేధావులు, తల్లిదండ్రులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా విద్యార్థులు మాత్రం వినిపించుకోవడం లేదు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వారు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు.

ఫెయిల్ అయ్యామని ముగ్గురు ఆత్మహత్య:
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ ఫలితాల విడుదల నేపథ్యంలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. ఇందులో ముగ్గురు ఫెయిలై ఆత్మహత్య చేసుకున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన సోలం సరయూ (15) గిరిజన బాలికల ఆశ్రమ జూనియర్‌ కాలేజీలో బైపీసీ ఫస్టియర్ చదివింది. ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ కావడంతో తీవ్ర మనోవేదనకు గురై వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం భజ్యానాయక్‌ తండాకు చెందిన నిఖిత (18) ముజాహిత్‌పూర్‌ ఆదర్శ కాలేజీలో ఇంటర్‌ చదివింది. ఫస్టియర్ లో 3, సెకండియర్ లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన నిఖిత గురువారం రాత్రి ఇంట్లో చీరతో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గజ్వేల్‌ పట్టణానికి చెందిన మహంకాళి బద్రినాథ్‌ పట్టణంలోని ఓ జూనియర్‌ కాలేజీలో సీఈసీ ఫస్టియర్ చదివాడు. ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్‌ అవడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

1

మార్కులు తక్కువ వచ్చాయని:
నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌కు చెందిన సోని (16) వనపర్తిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్ చదివింది. ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపానికి గురై ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డుకు చెందిన క్యాసారం శ్రావణి(17) గజ్వేల్‌లోని బాలికల ఎడ్యుకేషన్‌ హబ్‌లో ఇంటర్ ఫస్టియర్ (సీఈసీ) పూర్తి చేసింది. పరీక్షా ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

1

రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో:
తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇంటర్ ఫలితాలు ఓ విద్యార్థి ప్రాణం తీశాయి. ఆ కుటుంబంలో తీరని విషాదం నింపాయి. ఇంటర్ సెకండియర్ ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునింది. ఒక్కగానొక్క కూతురని అల్లారుముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన దూశి లక్ష్మణరావు, సరోజిని దంపతుల ఏకైక కుమార్తె స్వర్ణలత (17) ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయింది. అప్పటినుంచి మనస్తాపంతో ఉంటున్న కూతురిని తల్లిదండ్రులు సముదాయిస్తూ వచ్చారు. అయినా లతలో మార్పు లేదు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో:
జూన్ 13న వ్యవసాయ పనుల నిమిత్తం తల్లిదండ్రులు మరో గ్రామానికి వెళ్లడంతో స్వర్ణలత ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూతురు ఎత్తకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో తల్లి వెంటనే ఇంటికి వచ్చింది. ఇంట్లో చూడగా స్వర్ణలత ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. 

ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ఫలితాలు రాకముందే సూసైడ్:
ఫలితాలు వచ్చాకే కాదు ఫలితాలు రాకముందే ఫెయిల్ అవుతానేమో అనే భయంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన శిల్పా పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ఆత్మహత్య చేసుకుంది. చేగుంటకు చెందిన శిల్ప(17).. చేగుంటలోని మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్‌(బైపీసీ) చదువుతోంది. 18న ఇంటర్ ఫలితాలు వస్తాయని తెలిసినప్పటి నుంచి ఆ విద్యార్ధినిలో భయం పట్టుకుంది. ఆ భయంతో అన్నం తినడం కూడా మానేసింది. మానసికంగా కుంగిపోయింది. ఇది గమనించిన తల్లిదండ్రులు శిల్పకు ధైర్యం చెప్పారు. ఫెయిల్ అయినా పర్వాలేదని సర్దిచెప్పారు. కానీ, శిల్పలో మాత్రం భయం పోలేదు. తోటి విద్యార్థులు హేళన చేస్తారేమో అనే ఆందోళనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో  ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ర్యాంకులు, మార్కులే జీవితం కాదు:
విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర విషాదం నింపాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఫలితాలు, మార్కుల గురించి పట్టించుకోవద్దని పదే పదే చెప్పినా వినిపించుకోలేదని, ఇంత అఘాయిత్యానికి ఒడిగడతారని ఊహించలేదని వాపోయారు. పిల్లలపై మార్కుల ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందని నిపుణులు అంటున్నారు. తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిల్ అయినా నలుగురిలో పరువు పోతుందనో, స్నేహితులు హేళన చేస్తారనో, తల్లిదండ్రులు తిడతారనో.. ఇలాంటి భయాలతో, ఆత్మనూన్యతా భావంతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ర్యాంకులు, రిజల్స్ట్ పేరుతో పిల్లలపై తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటోంది. వారి ప్రాణాలు పోవడానికి అదే కారణమవుతోంది. కానీ జీవితం అంటే ఫస్ట్ ర్యాంకులు, మార్కులే కాదనే విషయాన్ని విద్యార్థులు గ్రహించలేకపోతున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, పిల్లలపై మానసిక ఒత్తిడి లేకుండా చదువులు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read: ఆదాయం పెంచుకోవడానికి : TS RTCలో పార్సిల్, కార్గో సేవలు