కశ్మీర్ లో ఉగ్రదాడి..ఐదుగురు వలస కూలీలు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : October 30, 2019 / 01:16 AM IST
కశ్మీర్ లో ఉగ్రదాడి..ఐదుగురు వలస కూలీలు మృతి

కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం ప్రాంతంలో పనిలో నిమగ్నమైన కూలీలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఐదుగురు కూలీలు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానిక అనంతనాగ్‌ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. 

మృతులందరూ వెస్ట్ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌కు చెందినవారుగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు షేక్ కమ్రుద్దీన్,షేక్ మహమ్మద్ రఫీక్,షేక్ ముర్న్ సులిన్ గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని జహూరుద్దీన్ గా గుర్తించారు. ఈ ప్రాంతంలో కాశ్మీరీయేతరులపై  శత్రుత్వం పెరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఉగ్రవాదుల కోసం 18 భద్రతా బలగాలు మరియు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడులు చేయడం కలకలం సృష్టిస్తోంది.

ఇటీవల కాలంలో కశ్మీర్ లో ఉగ్రదాడులు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. లారీ డ్రైవర్లను ముఖ్యంగా ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. సోమవారం అనంత్ నాగ్ లో ఉగ్రవాదులు ఓ ట్రక్కు డ్రైవర్ ని కాల్చి చంపిన విషయం తెలిసిందే. అదే రోజు సోపేర్ లో ని బస్ట్ స్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్నవాళ్లు టార్గెట్ గా ఉగ్రవాదులు దాడి చేశారు. అదే రోజు పుల్వామా జిల్లాలోని ఓ స్కూల్ బయట విధులు నిర్వహిస్తున్న పారామిలటరీ సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కేంద్రం ఈ మధ్యే జమ్మూలో ఆంక్షలు తొలగించింది. ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఎలా చొరబడ్డారు, దాడికి చేసిన ప్రణాళికలు మొదలైన అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.