50 ఏళ్ల మహిళపై అత్యాచారం,హత్య – పరారీలో ఆలయ పూజారి, ఇద్దరు నిందితులు అరెస్ట్

50 ఏళ్ల మహిళపై అత్యాచారం,హత్య – పరారీలో ఆలయ పూజారి, ఇద్దరు నిందితులు అరెస్ట్

50 year old Anganwadi worker gang raped, murdered in UP’s Badaun; temple priest among 3 booked : ఉత్తర ప్రదేశ్ లోని బడాన్ జిల్లాలో ఒక అంగన్ వాడి కార్యకర్తపై ఆలయ మహంత్ అతని ఇద్దరూ అనుచరులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈఘటన స్ధానికంగా కలకలం రేపింది. కేసు నమోదు, విచారణలో అలసత్వం వహించినందుకు స్ధానిక ఎస్సైను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

బడాన్ జిల్లాలోని ఉఘైటీ ప్రాంతంలోని ఒక గ్రామంలో జనవరి 3వ తేదీ, ఆదివారం సాయంత్రం వేళ అంగన్ వాడి కార్యకర్తగా పనిచేస్తున్న మహిళ(50) తన ఇంటికి సమీపంలోని ఆలయానికి దర్శనం చేసుకోటానికి వెళ్లింది. అక్కడ ఉండే మహంత్ తో ఆకుటుంబానికి పరిచయం ఉంది. ఆమె కుటుంబ సభ్యులు మహంతును గురువుగా గౌరవిస్తారు. తరచూ వారి కుటుంబం ఆలయంలో ఎక్కవ సేపు గడుపుతూ ఉండేది.

ఆదివారం రాత్రి 11-30 గంటల సమయంలో అపస్మారక స్ధితిలో ఉన్న ఆ మహిళను, మహంత్ అతని అనుచరులు ఇంటివద్దకు తీసుకు వచ్చి దింపారు. ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆలయం సమీపంలోని పాడు బడిన బావిలో పొరపాటున పడటంతో తీవ్రగాయాలయ్యాయని వారు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. మహిళ ప్రాణాలతో ఉందని ఆస్పత్రికి తీసుకు వెళ్లమని మహంతును కోరగా వారు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కుటుంబ సభ్యులు ఆమెకు తెలివి వచ్చాక విషయం తెలుసుకుందామనుకునే లోపు ఆమె మరణించింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం అయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే వారు ఉఘైటి పోలీసు స్టేషన్ లో ఆలయం మహంతు సత్యనారాయణ , అతని ఇద్దరు అనుచరులు జస్పాల్, వేదారామ్ లపై ఫిర్యాదు చేశారు.

సోమవారం సాయంత్రానికి పోలీసులు బాధితురాలి ఇంటికి వచ్చి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు మంగళవారం సాయంత్రనికి నివేదికి వెల్లడించింది. ఆమె పక్క టెముకలు విరిగిపోయి ఉన్నాయని… ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తెలిపారు. ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లటం వల్ల కాలికి గాయమైనట్లు కూడా రిపోర్టులో ఉంది.

నిందితులపై ఐపీసీ సెక్షన్ 302,376 కింద కేసు నమోదు చేసిన పోలీసులు మహంత్, అతని అనుచరులను అదుపులోకి తీసుకోటానికి ఆలయానికి వెళ్లగా….అప్పటికే మహంత్ సత్యనారాయణ పరారీలో ఉన్నారు. అతని అనుచరులిద్దరు జస్పాల్, వేదారామ్ లను అదుపులోకి తీసుకున్నారు.

మహంత్ ను పట్టుకోటానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు సీఎం యోగీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. దీంతో సీఎం యోగీ ఆదిత్యనాధ్ విచారణకు ఆదేశించారు. బరేలీ ఏడీజీని ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారించి సత్వరన్యాయం అందిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఆలయం వద్ద బావి చాలా దూరంలో ఉందని అటువైపు ఎవరూ వెళ్లరని… పొరపాటున బావిలో పడే అవకాశం లేదని స్ధానికులు తెలిపారు.

కాగా బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వెంటనే స్పందించనందున, బాధితురాలిని ఆస్పత్రికి తరలించనుందున ఉఘైటీ పోలీసు స్టేషన్ ఎస్సైను అధికారులు సస్పెండ్ చేశారు.