Fake Police: తల్లి కళ్ళలో ఆనందం కోసం కటకటాల పాలయ్యాడు!

కని కంటికి రెప్పగా పెంచిన తల్లిని సంతోష పెట్టాలంటే కష్టపడి ఉద్యోగం సంపాదించాలి. కానీ, ఓ యువకుడు తనకు పోలీస్ ఉద్యోగం వచ్చిందని ఓ యూనిఫామ్ వేసుకొని తల్లి ముందు నటించాడు. అలానే నమ్మించి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ, చివరికి ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా బుక్కై కటకటాల పాలయ్యాడు.

10TV Telugu News

Fake Police: కని కంటికి రెప్పగా పెంచిన తల్లిని సంతోష పెట్టాలంటే కష్టపడి ఉద్యోగం సంపాదించాలి. కానీ, ఓ యువకుడు తనకు పోలీస్ ఉద్యోగం వచ్చిందని ఓ యూనిఫామ్ వేసుకొని తల్లి ముందు నటించాడు. అలానే నమ్మించి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ, చివరికి ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా బుక్కై కటకటాల పాలయ్యాడు. అయితే.. తాను ఎవరిని బెదిరించలేదని తన తల్లి ఆనందం కోసమే యూనిఫామ్ వేసుకున్నానని పోలీసులకు చెప్పడం కొసమెరుపు.

వివరాలలోకి వెళ్తే.. ఏపీలోని కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరుకు చెందిన లుక్కా పృథ్వీరాజ్ డిగ్రీ చదివాడు. తండ్రి లేకపోవడంతో తల్లి సుజాత కూలి పనులు చేస్తూ అతడ్ని చదివించింది. చిన్నప్పటి నుండి పోలీస్ కావాలని కలలుకన్న పృథ్విరాజ్ 2017లో కానిస్టేబుల్ సెలక్షన్స్ కు వెళ్లినా ఉద్యోగం సాధించలేకపోయాడు. కానీ, తన తల్లి ఆనందం కోసం తనకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందని, విజయవాడలో పోస్టింగ్ ఇచ్చారని అందర్నీ నమ్మించాడు.

ట్రైనింగ్ పేరిట మూడు నెలల పాటు ఇంటికి దూరంగా ఉన్న పృథ్వీరాజ్ ఆ సమయంలో విజయవాడ శివారులో తన ఫ్రెండ్ కోళ్ల పారంలో పనిచేస్తూ డబ్బు ఇంటికి పంపాడు. ట్రైనింగ్ అయి పోస్టింగ్ వచ్చిందని చెప్పి ఏడాది క్రితం పెళ్లి కూడా చేసుకుని అదే కోళ్ల ఫారంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అంతాబాగానే ఉందనుకుంటుండగా ఆదివారం కండ్రిక సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా యూనిఫామ్ లో ఇంటికి వెళ్తూ దొరికిపోయాడు.

వాహనం ఆపిన అసలు పోలీసులు పృథ్వీరాజ్ ఐడీ కార్డు చూపించమనడంతో బండారం బయటపడింది. నకిలీ పోలీస్ అని తేలడంతో అసలు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి నున్న పీఎస్ కు తరలించారు. ఐతే పృథ్వీ మాత్రం తాను యూనిఫాం ధరించి ఎవర్నీ బెదిరించలేదని, కేవలం తన తల్లి సంతోషం కోసమే అలా చేశానని పోలీసులకు వివరించే ప్రయత్నం చేశాడు. కానీ చేసింది తప్పే కావడంతో కటకటాలు తప్పలేదు.

10TV Telugu News