మరో విషాదం : MRO ను రక్షించబోయిన డ్రైవర్ గుర్నాధం మృతి

  • Edited By: chvmurthy , November 5, 2019 / 05:50 AM IST
మరో విషాదం : MRO ను  రక్షించబోయిన డ్రైవర్ గుర్నాధం మృతి

హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన సమయంలో ఆమెను రక్షించబోయి గాయాలపాలైన డ్రైవర్ గురునాధం డీఆర్ డీవో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం, నవంబర్ 5 , ఉదయం  మృతి చెందాడు.

విజయారెడ్డిని కాపాడే క్రమంలో గురునాధానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆర్ డీవో ఆస్పత్రి కి తరలించారు. చికిత్స అందిస్తున్నప్పటికీ  పరిస్ధితి విషమించటంతో  మంగళవారం ఉదయం డ్రైవర్ గురునాధం కన్నుమూశాడు.అతడి స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ. మృతదేహాన్ని మరి కొద్ది సేపట్లో ఉస్మానియా మార్చురీకు తరలించనున్నారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించి పార్ధివదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అందచేస్తారు.

ఈ దాడిలో ఎమ్మార్వో విజయారెడ్డి అక్కడికక్కడే మరణించగా.. నిందితుడు సురేష్‌కు 35శాతంపైగా గాయాలై ఉస్మానియాలో చికిత్సపొందుతున్నాడు. అలాగే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్, అటెండర్‌‌, మరో వ్యక్తి ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. అటెండర్ చంద్రయ్యకు 60శాతంపైగా గాయాలుకాగా.. డ్రైవర్ గురునాథం కూడా 80శాతం కాలిన గాయాలు అయ్యాయి. వీరిద్దర్ని అపోలో డీఆర్‌డీఎల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో నారాయణ అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. కాగా అపోలో డీఆర్‌డీఎల్ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురునాథం మంగళవారం ఉదయం కన్నుమూశాడు.