షేక్‌పేట్ తహశీల్దార్ సుజాత ఇంట్లో రూ.30లక్షల నగదు, బంగారు ఆభరణాలు

హైదరాబాద్ లో ఓ భూ వివాదం పరిష్కారం కేసులో రూ.15లక్షలు తీసుకుంటూ షేక్ పేట్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జునరెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం

10TV Telugu News

హైదరాబాద్ లో ఓ భూ వివాదం పరిష్కారం కేసులో రూ.15లక్షలు తీసుకుంటూ షేక్ పేట్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జునరెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం

హైదరాబాద్ లో ఓ భూ వివాదం పరిష్కారం కేసులో రూ.15లక్షలు తీసుకుంటూ షేక్ పేట్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జునరెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఆర్ఐని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారంలో కేసు మాఫీ చేసేందుకు లంచం తీసుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ రవీంద్రనాయక్ ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారిద్దరని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాఫ్తు చేస్తున్న ఏసీబీ అధికారులు షేక్ పేట్ తహశీల్దార్ సుజాత పాత్రపైనా ఎంక్వైరీ జరుపుతున్నారు. తహశీల్దార్ కు ఏమైనా ప్రమేయం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు.

తహశీల్దార్ ఇంట్లో నోట్ల కట్టలు:
శనివారం తహశీల్దార్ సుజాత ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా రూ.30లక్షల నగదు, బంగారు ఆభరణాలు లభించడం సంచలనంగా మారింది. అంత క్యాష్ ఇంట్లో ఉండటం చూసి అధికారులు షాక్ తిన్నారు. ఈ క్రమంలో సుజాతను అదుపులోకి తీసుకున్న అధికారులు సుదీర్ఘంగా విచారించారు. షేక్ పేట్ తహశీల్దార్ ఆఫీస్ లో అర్థరాత్రి వరకు ఏసీబీ సోదాలు కొనసాగాయి. శనివారం(జూన్ 6,2020) అర్థరాత్రి 12గంటలకు సుజాతను ఇంటికి పంపారు అధికారులు. రెండో రోజు(ఆదివారం జూన్ 7) కూడా తహశీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ ఆఫీస్ లో విచారించనున్నారు. ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు.

అసలేం జరిగిందంటే:
పాతబస్తీకి చెందిన సయ్యద్ ఖాలీద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో 1.20 ఎకరాల స్థలం ఉందని.. సర్వే చేయాలని 2019 డిసెంబర్ లో షేక్ పేట తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ఆ భూమి తనదేనంటూ 5 నెలల క్రితం బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ తహశీల్దార్ సుజాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఖాలీద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగుతుండగానే.. కేసు మాఫీ చేస్తానంటూ ఎస్ఐ రవీంద్రనాయక్ డబ్బు డిమాండ్ చేశారు. రూ.50 లక్షలు ఇస్తే భూమి మీదేనంటూ రాసిస్తానని ఆర్ఐ నాగార్జున సైతం ఖాలీద్ కు చెప్పారు.

కేసు మాఫీకి రూ.3లక్షలు లంచం అడిగిన ఎస్ఐ:
ఖాలీద్ పై జనవరిలో కేసు నమోదైన వెంటనే ఎస్ఐ రవీంద్రనాయక్ కేసు మాఫీ చేస్తానని రూ.3 లక్షలు డిమాండ్ చేసి.. ఫిబ్రవరిలో రూ.లక్ష తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఖాలీద్ పై ఏప్రిల్ లో రెండోసారి కేసు నమోదైంది. రెండు కేసులను మాఫీ చేయాలంటే అదనంగా మరో రూ.3 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి, మరో రూ.50 వేలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆర్ఐ ఫోన్ చేసి.. రూ.50 లక్షలు కాదు.. రూ.30 లక్షలు ఇస్తే సరిపోతుందని ఖాలీద్ కు చెప్పారు. ఎస్ఐ అదనంగా రూ.3 లక్షలు అడగడం, ఆర్ఐ రూ.30 లక్షలు డిమాండ్ చేయడంతో విసుగు చెందిన ఖాలీద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీనిపై వారికి ఫిర్యాదు చేశారు. 

రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఆర్ఐ:
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు స్కెచ్ వేశారు. వారి సూచన మేరకు ఆర్ఐకి ఖాలీద్ ఫోన్ చేశారు. ముందుగా రూ.15 లక్షలు ఇస్తానని చెప్పగా అందుకు ఆర్ఐ అంగీకరించారు. ఖాలీద్ శనివారం(జూన్ 6,2020) నగదుతో బంజారాహిల్స్ లోని షేక్ పేట తహశీల్దార్ ఆఫీస్ కి వెళ్లారు. సమీపంలోని ఒక గల్లీలోకి ఆర్ఐ బుల్లెట్ పై వచ్చి నగదు తీసుకుంటుండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆర్ఐని పట్టుకున్నారు. భూవివాదం కేసులో రూ.15లక్షలు లంచం తీసుకుంటూ ఆర్ఐ అడ్డంగా దొరికిపోవడం, కేసు మాఫీ చేస్తానని ఎస్ఐ లంచం డిమాండ్ చేయడం సంచలనం రేపాయి. ఇప్పటికే పోలీసు, రెవెన్యూ శాఖలపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. లంచం లేనిదే ఏ పని జరగదన్న అపవాదు ఉంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన ఆయా శాఖల ప్రతిష్టను మరింత దిగజార్చింది.