సైబర్ సెల్ అలర్ట్ : మీ వాట్సాప్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? అకౌంట్లో డబ్బులు గోవిందా!

  • Published By: sreehari ,Published On : September 23, 2019 / 02:00 PM IST
సైబర్ సెల్ అలర్ట్ : మీ వాట్సాప్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? అకౌంట్లో డబ్బులు గోవిందా!

మీరు వాట్సాప్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఈ వార్త మీకు చాలా ముఖ్యం. మీ వాట్సాప్ పై మోసగాళ్లు మాటు వేసి ఉన్నారు. ఏ క్షణంలోనైనా మీ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. పాకిస్థానీకి చెందిన మోసగాళ్లు వాట్సాప్ ద్వారా మీ అకౌంట్ నుంచి డబ్బులు కాజేసే ముప్పు ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. ఈ మేరకు సోమవారం ఒక అడ్వైజరీ జారీ చేసింది.

పాకిస్థాన్ ఆధారిత ఆపరేట్ చేసే సైబర్ నేరగాళ్లు యూజర్లను ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించాయి. ప్రత్యేకించి ఎంతో పాపులర్ అయినా బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి (KBC)షోకు చెందిన సోషల్ అకౌంట్లతో యూజర్లను మాయ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ‘వ్యక్తిగత వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేసుకుని వారి వాట్సాప్ గ్రూపులకు KBC నుంచి మెసేజ్ లు పంపుతున్నట్టుగా నమ్మిస్తున్నారు. 

కేబీసీ షోలో అవకాశం పొందాలంటే వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కావాలని యూజర్లను ప్రేరేపిస్తున్నారు. యూజర్లను ట్రాప్ చేసేందుకు సైబర్ మోసగాళ్లు పాపులారిటీ టీవీ షోలను అదనుగా భావించి ఇలాంటి మెసేజ్ లు పంపుతున్నారు. ఫేక్ KBC మెసేజ్ ల విషయంలో జాగ్రత్త వహించండి. సైబర్ సెల్ రక్షణ మంత్రిత్వ శాఖకు ఇప్పటికే దీనిపై అడ్వైజరీలను రిపోర్టు చేసింది’ అని జారీ చేసిన సెక్యూరిటీ అడ్వైజరీలో రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవలే నల్సాపోరా ప్రాంతానికి చెందిన కవిత, ఆమె కుటుంబ సభ్యులు.. సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

KBC నుంచి కాల్ చేసినట్టుగా మోసగాళ్లు వీరిని మోసగించారు. కేబీసీ లాటరీ ద్వారా బాధితురాలు కవితకు రూ.25 లక్షలు వస్తాయని నమ్మబలికారు. ఆ విషయం నమ్మిన ఆమె కుటుంబ సభ్యులు మోసపోయారు. పాకిస్థానీకి చెందిన మొబైల్ నెంబర్లలో 92-3077902877, 92-3040943299లతో కూడిన వాట్సాప్ అడ్మిన్ గ్రూపులుగా ఉన్నాయని అడ్వైజరీ గుర్తించింది. ఇలాంటి వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయిన వారు వెంటనే ఎగ్జిట్ అవ్వాలని సైబర్ సెల్ ఆఫ్ MoD సూచిస్తోంది. 

200 మిలటరీ అధికారుల ఫేక్ అకౌంట్లు :
మిలటరీ అధికారులకు సంబంధించి 2వందల వరకు ఫేక్ అకౌంట్లను సైబర్ సెల్ గుర్తించింది. వీరిలో ప్రస్తుతం వర్క్ చేస్తున్న వారితో పాటు రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నారు. కశ్మీరీ అంశంపై పాకిస్థాన్ కు అనుకూలంగా సోషల్ మీడియా ద్వారా ట్విట్లు, మెసేజ్ లను వ్యాప్తి చేస్తున్నారు. 

మీ డబ్బు సేవ్ చేసుకోండిలా :
సైబర్ సెల్ అడ్వైజరీ ప్రకారం.. మీ వాట్సాప్ Settings లో కాంటాక్స్ సేవ్ చేసిన వ్యక్తుల వారికి మాత్రమే పర్మీషన్ ఇచ్చేలా సెట్ చేసుకోండి. అప్పుడు.. మొబైల్ కాంటాక్ట్ లిస్టులో సేవ్ అయినవారికి మాత్రమే యాడ్ అయ్యే అనుమతి ఉంటుంది. ఒకవేళ లేదంటే మీకు ఒక ఇన్విటేషన్ వస్తుంది. ఆ ఇన్విటేషన్ యాక్సప్ట్ చేస్తేనే మీరు ఆ గ్రూపుల్లో జాయిన్ అవుతారు. మీ ఫోన్ లో వారి మొబైల్ నెంబర్ యాడ్ అయి ఉంటే.. ఎలాంటి ఇన్విటేషన్ లేకుండానే యాడ్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. 

* Whatsapp Settingsలోకి వెళ్లండి.. 
* అందులో అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
*  ప్రైవసీ బటన్ పై క్లిక్ చేసి.. గ్రూప్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
* అక్కడ మొత్తం 3 ఆప్షన్లు ఉంటాయి.. Everyone, My contacts, Nobody 
* My Contacts అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
* మీ అనుమతి లేకుండా ఎవరూ కూడా మీ అకౌంట్ ను గ్రూపుల్లో జాయిన్ చేయలేరు.