అనంతలో గోల్డ్ డంప్.. 8ట్రంకు పెట్టెల్లో 84కిలోల వెండి, 3కిలోల బంగారం, రూ.15లక్షల నగదు.. ఇంత సొత్తు ట్రెజరీ ఉద్యోగికి ఎక్కడి నుంచి వచ్చింది

  • Published By: naveen ,Published On : August 19, 2020 / 12:38 PM IST
అనంతలో గోల్డ్ డంప్.. 8ట్రంకు పెట్టెల్లో 84కిలోల వెండి, 3కిలోల బంగారం, రూ.15లక్షల నగదు.. ఇంత సొత్తు ట్రెజరీ ఉద్యోగికి ఎక్కడి నుంచి వచ్చింది

అనంతపురం జిల్లాలో ఓ సాధారణ వ్యక్తి ఇంట్లో గోల్డ్ డంప్ బయటపడటం సంచలనంగా మారింది. అతడి ఇంట్లో దొరికిన 8 ట్రంకు పెట్టెల్లో 84కిలోల వెండి, 3 కిలోల బంగారం, 15లక్షల నగదు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంత నిధి ఎక్కడి నుంచి వచ్చింది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.



ఓ సాధారణ వ్యక్తి ఇంట్లో బంగారం నిధి:
అతడు ఓ సాధారణ వ్యక్తి. అందరిలా మూములుగా జీవితం గడుపుతున్నాడు. ఇంకా చెప్పాలంటే రోజువారి పని చేసుకునే వ్యక్తి. పొద్దంతా వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తాడు. అలాంటి వ్యక్తి దగ్గర ఉన్న సొత్తు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. 8 ట్రంకు పెట్టెల్లో కిలోల కొద్ది బంగారం, వెండి, కరెన్సీ కట్టలు దాచాడు. మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఏదో అనుకుంటే మరేదో దొరికింది అన్నట్టుగా, రివాల్వర్ కోసం ఆ ఇంటికి వచ్చిన పోలీసులకు కళ్లు జిగేల్ మనేలా నగదు, నగలు లభించాయి.





రివాల్వర్ కోసం వెళితే బయటపడ్డ గోల్డ్ డంప్:
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఎస్సీ కాలనీలోని ఓ ఇంటికి మంగళవారం(ఆగస్టు 18,2020) రాత్రి పోలీసులు భారీగా వచ్చారు. కారు డ్రైవర్ అయిన నాగలింగం మామ బెళప్ప ఇంట్లో డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడేం జరుగుతుందో కాలనీ వాసులకు తెలియలేదు. ఇంతలోనే పోలీసులకు 8 పురాతన ట్రంకు పెట్టెలు దొరికాయి. వాటిని తెరిచి చూడగా వారి మైండ్ బ్లాంక్ అయ్యింది. కళ్లు బైర్లు కమ్మాయి. అందులో కిలోల కొద్ది గోల్డ్, వెండి ఉంది. అలాగే రూ.15లక్షల నగదు కూడా ఉంది. ఏకంగా 84 కిలోల వెండి సామాగ్రి, 3 కిలోల గోల్డ్ నగలు లభ్యమయ్యాయి. రెండు రివాల్వర్లు కూడా దొరికాయి.

ఆ గోల్డ్ డంప్ ట్రెజరీ ఉద్యోగిది:
ఓ సాధారణ కారు డ్రైవర్ మామ ఇంట్లో 8 ట్రంకు పెట్టెలు ఉండటం ఏంటని పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. పట్టుబడ్డ సొత్తు అంతా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. మనోజ్ దగ్గర నాగలింగం కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.



4 కార్లు, 5 గుర్రాలు.. ట్రెజరీ ఉద్యోగి విలాసవంతమైన జీవితం:
మనోడ్ తండ్రి హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ మరణించారు. దీంతో మనోజ్ కు కారుణ్య నియామకం కింద అనంతపురం ట్రెజరీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. ఆయనకు సొంతంగా ఈ స్థాయిలో ఆస్తులు సమకూర్చుకునే సామర్థ్యం లేదని పోలీసులు చెబుతున్నారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న నగలు, నగదుని పోలీసులు ట్రెజరీలో భద్రపరుస్తూ ఉంటారు. వాటినే మనోజ్ పక్కదారి పట్టించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ ది విలాసవంతమైన జీవితం. అతడి దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి. 5 గుర్రాలు ఉన్నాయి.

భార్యతో విబేధాలు, బయటపడ్డ ట్రంకు పెట్టెలు:
గుర్రాల సంరక్షణకు, కారు డ్రైవర్ గా పని చేసేందుకు నాగలింగం అనే వ్యక్తిని నియమించుకున్నాడు. అయితే మనోజ్ కు తన భార్యతో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో భార్య ఆమె తరుఫు బంధువులపై నాగలింగంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడు. మనోజ్ తమను రివాల్వర్ తో బెదిరించినట్టు భార్య తరుఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మనోజ్ ను పిలిచి ప్రశ్నించిన పోలీసులు రివాల్వర్ పై కూపీ లాగారు. ఆ రివాల్వర్ ను మనోజ్ తన డ్రైవర్ నాగలింగంకు అప్పగించినట్టు తెలుసుకున్నారు. దాంతో నాగలింగం, అతడి మామ ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు బంగారం, వెండి నిధి బయటపడింది.



ట్రెజరీ ఆఫీసులో ఉన్నతాధికారుల పాత్రపై ఆరా:
పై అధికారులు, భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ట్రెజరీ ఆఫీస్ నుంచి ట్రంకు పెట్టెలు తరలించడం అంత సులభం కాదు. జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మనోజ్ ఈ స్థాయిలో వెండి, బంగారం సామాగ్రిని తరలించడం సాధ్యమయ్యే పనే కాదు. దీంతో ట్రెజరీ ఆఫీసులో పని చేసే ఉన్నతాధికారులు ఎవరైనా మనోజ్ కు సహకరించారా? అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ట్రెజరీ ఆఫీస్ లో ఉన్నతాధికారుల పాత్రపైనా కూపీ లాగుతున్నారు.