మరో సైబర్ నేరం : రైతన్న కష్టాన్ని మింగేశారు

  • Published By: veegamteam ,Published On : February 21, 2019 / 05:16 AM IST
మరో సైబర్ నేరం : రైతన్న కష్టాన్ని మింగేశారు

రేగడిమామిడిపల్లి : సైబర నేరగాళ్ల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా..ఈ నేరాలు కొనసాగుతునే ఉన్నాయి. కష్టపడకుండా సంపాదించేయాలనే పేరాశతో బ్యాంక్ ఎకౌంట్స్ హ్యాక్ చేసేసి డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరస్థులు. ఈ క్రమంలో కష్టపడి పండించిన పంట డబ్బులు చేతికి రాగానే బ్యాంక్ లో వేసుకున్నాడో రైతన్న. 
 

పత్తిపంట అమ్మగా వచ్చిన మొత్తం అకౌంట్‌ని సర్వం కొల్లగొట్టేశారు. తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం రేగడిమామిడిపల్లికి చెందిన కేశన్నగారి అమృతారెడ్డి పత్తిపంట సాగుచేశారు. పంటను అమ్మగా వచ్చిన డబ్బును రెండు రోజుల క్రితం తన బ్యాంక్ ఎకౌంట్ లో రూ.4 లక్షల 34 వేల రూపాయలు వేశాడు. కానీ ఫిబ్రవరి 20న అమృతారెడ్డి ఖాతా నుంచి డబ్బు విత్‌ డ్రా చేస్తున్నట్లు పలుమార్లు మెసేజ్‌లు వచ్చాయి.  దీంతో అనుమానం వచ్చిన అమృతారెడ్డి తన బ్యాంకు ఖాతా ఉన్న చన్‌గోముల్‌ స్టేట్‌ బ్యాంక్‌ శాఖకు వెళ్లి వివరాలు కనుక్కున్నాడు.ఇంకేముంది ఎకౌంట్ లో డబ్బులు ఖాళీ అయినట్లుగా తెలిసింది. 
 

అతని ఎకౌంట్ నుంచి పేటీఎం, ఓలా క్యాబ్స్‌, అమెజాన్‌కు డబ్బు బదిలీ అయినట్టు బ్యాంక్ స్టాఫ్ చెప్పడంతో అమృతారెడ్డి షాక్‌ అయ్యారు. సైబర్‌ నేరగాళ్లు అమృతారెడ్డి బ్యాంకు ఎకౌంట్ ఇన్ఫర్మేషన్ లాగేసుకుని డబ్బు పడగానే బురిడీ కొట్టించినట్టు బ్యాంకు అధికారులు అనుమానిస్తున్నారు. మోసపోయానని గుర్తించిన అమృతారెడ్డి జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.