డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో రూ.78లక్షలు స్వాధీనం.. ఇంటి నిండా నోట్ల కట్టలే.. ఎంత కష్టపడి సంపాదించాడో

తమిళనాడు రాష్ట్రం వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ అధికారులు దినకరన్ ను అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 06:17 PM IST
డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో రూ.78లక్షలు స్వాధీనం.. ఇంటి నిండా నోట్ల కట్టలే.. ఎంత కష్టపడి సంపాదించాడో

తమిళనాడు రాష్ట్రం వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ అధికారులు దినకరన్ ను అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో

తమిళనాడు రాష్ట్రం వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ అధికారులు దినకరన్ ను అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దినకరన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. వారికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. తనిఖీల్లో భారీగా నగదు బయటపడింది. దినకరన్ ఇంట్లో ఇప్పటివరకు రూ.78లక్షల నగదు దొరికింది.

రూ.50వేలు లంచం డిమాండ్:
వేలూరు కలెక్టరేట్ లో స్టాంప్స్ సెక్షన్ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా దినకరన్ విధులు నిర్వహిస్తున్నారు. రూ.50వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. భూమి రిజిస్ట్రేషన్ స్టాంప్ ఫీజుకి సంబంధించి రంజిత్ కుమార్ అనే వ్యక్తిని దినకరన్ రూ.50వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంజిత్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని దినకరన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

నేషనల్ హైవేపై కారు చేజింగ్ సీన్:
లంచం డబ్బు తీసుకున్న తర్వాత దినకరన్ కారులో వేగంగా వెళ్లిపోయారు. ఏసీబీ అధికారులు దినకరన్ కారుని వెంబడించాల్సి వచ్చింది. చెన్న-బెంగళూరు నేషనల్ హైవేపై కాసేపు చేజింగ్ సీన్ కనిపించింది. చివరికి దినకరన్ కారుని అడ్డగించిన అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దినకరన్ కారు నుంచి రూ.1.94లక్షల నగదుని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దినకరన్ వ్యక్తిగత డ్రైవర్ రమేష్ కుమార్ ని కూడా అరెస్ట్ చేశారు. 

డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో కట్టలకట్టల డబ్బు:
శనివారం(ఫిబ్రవరి 29,2020) ఉదయం ఏసీబీ అధికారులు కాట్పాడిలోని తంగల్ లో దినకరన్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.78లక్షల నగదు దొరికింది. ఇంత డబ్బు ఇంట్లో నుంచి దొరికేసరికి అధికారులు షాక్ తిన్నారు. ఇంట్లో ఎక్కడ చూసినా కట్టల కట్టల డబ్బు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ డబ్బంతా లంచంగా తీసుకున్నట్టు అధికారుల విచారణలో తేలింది. పలు ప్రభుత్వ శాఖల్లో పని చేసిన దినకరన్ భారీగా లంచాలు తీసుకున్నట్టు తేలింది. దినకరన్ పై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఆయన అవినీతి, అక్రమాల గురించి ఆరా తీస్తున్నారు. ఓ ప్రభుత్వ అధికారి ఈ రేంజ్ లో లంచాలు వసూలు చేయడం అధికార వర్గాల్లో సంచలనంగా మారింది.

ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదా?
ఉద్యోగులకు ప్రభుత్వం నెల నెల జీతం ఇస్తుంది. వారి శాలరీ వేల రూపాయల్లో ఉంటుంది. కొందరి లక్షల్లో ఉంటుంది. అయినా.. కొందరు అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. లంచాలకు రుచి మరిగి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. లంచం ఇవ్వనిదే పనులు చెయ్యడం లేదు. లంచం తీసుకునే అధికారులను అరెస్ట్ చేసి జైలుకి పంపుతున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. ఏ మాత్రం భయపడకుండా లంచాలు తీసుకుంటున్నారు.