నిషేధిత మందులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై అధికారులు దాడి 

  • Published By: chvmurthy ,Published On : May 3, 2019 / 12:11 PM IST
నిషేధిత మందులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై అధికారులు దాడి 

హైదరాబాద్: నాచారంలోని ఓ మందుల తయారీ ఫ్యాక్టరీ పై నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లుగా  సాగుతున్న వ్యాపారానికి అధికారులు నేడు చెక్ పెట్టారు. ఫ్యాక్టరీపై దాడి చేసి, మందు తయారీకి ఉపయోగిస్తున్న ముడి పదార్దాలను స్వాధీనం చేసుకున్నారు. మందుల తయారీలో కెటమైన్ అనే డ్రగ్ వాడుతున్నారని తేలడంతో ఫ్యాక్టరీకి అధికారులు సీల్ వేశారు. మనిషిలో సెక్స్ హార్మోన్లు పెరిగేలా ఫ్యాక్టరీ యాజమాన్యం మందులు తయారు చేస్తోంది. ఈ డ్రగ్స్ వాడిన వారు విచక్షణ కోల్పోయి మృగంలా మారి రేప్ చేయడానికి కూడా వెనుకాడరని అధికారులు తెలిపారు.

మందు తయారీకి ఉపయోగిస్తున్న ముడిపదార్ధం ఎక్కడి నుంచి వస్తోందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫ్యాక్టరీలో ఒక మందు తయారు చేసేందుకు లైసెన్స్ తీసుకుని, ఫ్యాక్టరీలో వేరే మందు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ స్త్రీలకు ఇచ్చిన తర్వాత వారిపై పురుషులు దాడి చేస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని ఫ్యాక్టరీలపై దాడులు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో నాచారంలోని ‘ఇంతం’ ల్యాబ్‌లో అధికారులు దాడులు చేసి సీజ్ చేశారు. ఈ మందు వాడిన వారు దాదాపు 5 గంటలపాటు అపస్మారక స్ధితిలో ఉంటారని అధికారులు  తెలిపారు.