హత్యా? ఆత్మహత్యా? అదృశ్యమైన అనూష చెరువులో శవమై కనిపించింది, మిర్యాలగూడలో దారుణం

  • Published By: naveen ,Published On : September 30, 2020 / 02:58 PM IST
హత్యా? ఆత్మహత్యా? అదృశ్యమైన అనూష చెరువులో శవమై కనిపించింది, మిర్యాలగూడలో దారుణం

anusha death mystery: ఆ దంపతులు జీవనోపాధి కోసం ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వచ్చారు. భర్త ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా…భార్య ఇంట్లోనే ఉండేది. ఓ రోజు ఆ మహిళ ఇంటి నుంచి అదృశ్యమైంది. ఓ వైపు భర్త.. మరోవైపు పోలీసులు గాలించినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. సరిగ్గా రెండు రోజులకు ఓ శివారు ప్రాంతంలోని చెరువులో శవంగా ప్రత్యక్షమైంది. ఇంతకీ ఆ మహిళది హత్యా..? ఆత్మహత్యా..?

బోటింగ్‌ పార్క్‌ సమీపంలో చెరువు:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో పెద్ద చెరువుగా పిలవబడే చెరువు పక్కనే బోటింగ్‌ పార్క్‌ ఉంటుంది. ఈ చెరువు మిర్యాలగూడ పట్టణానికి శివారు ప్రాంతంలో ఉంటుంది. జనాలు తక్కువగా తిరుగుతుంటారు. ఎప్పటిలాగే అక్కడి స్థానికులు అటు వైపుగా నడుచుకుంటూ వెళ్తుండగా..చెరువు ఒడ్డున చెట్లు, చెత్తలో చిక్కుకుపోయిన ఓ డెడ్‌బాడీ కన్పించింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా మృతదేహం కన్పించడంతో భయాందోళనకు గురయ్యారు. ఆ డెడ్‌బాడీ ఎవరిదా అని అక్కడికి వెళ్లి చూశారు. ఓ మహిళ మృతదేహంగా గుర్తించారు. అయితే ఆ మహిళ ఎవరన్నది తెలియకపోవడంతో…పోలీసులకు సమాచారమిచ్చారు.

అతి కష్టం మీద డెడ్‌బాడీని బయటికి తీశారు:
స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. డెబ్‌బాడీని బయటకు తీసేందుకు స్థానికుల సాయం తీసుకున్నారు. ముందు డెడ్‌బాడీ చుట్టూ ఉన్న చెట్లు, చెత్త చెదారాన్ని తొలగించి..అతి కష్టం మీద డెడ్‌బాడీని బయటికి తీశారు స్థానికులు. అనంతరం ఆ మహిళను..రెండు క్రితం అదృశ్యమైన మహిళే అయి ఉంటుందని అనుమానించారు. వెంటనే ఆ మహిళ భర్తకు సమాచారమిచ్చారు. అక్కడి చేరుకున్న ఆ వ్యక్తి…మృతురాలు తన భార్యేనని గుర్తించాడు. విగత జీవిగా మారిన భార్యను చూసి కన్నీరుమున్నీరయ్యాడు.

సడెన్ గా అనూష అదృశ్యం:
మృతురాలు అనూష, ఆమె భర్త సుధీర్‌కుమార్‌..దంపతుల స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం మిర్యాలగూడకు వచ్చారు. సుధీర్‌కుమార్‌ ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ ఆఫీస్‌లో పని చేస్తున్నాడు. రెండేళ్ల నుంచి మిర్యాలగూడలోనే ఉంటున్నారు. మరి ఈ దంపతుల మధ్య ఏం జరిగిందో..ఏమో..అనూష..రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆఫీస్‌ నుంచి తిరిగి వచ్చిన సుధీర్‌కుమార్‌..అనూష కోసం గాలించాడు. అయినా ఆచూకీ లభించకపోవడంతో..అదే రోజు టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కూడా..రెండు రోజులు నుంచి గాలించినా అనూష జాడ తెలియలేదు. రెండు రోజుల తర్వాత..ఇలా చెరువులో శవమై తేలింది.

హత్యా? ఆత్మహత్యా? భర్త హస్తం ఉందా?
అనూష మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనూష ఆత్మహత్య చేసుకుందా..? లేదా ఎవరైన హత్య చేసి పడేశారా..? ఒకవేళ హత్య అయితే..ఎవరు..ఎందుకు చంపాల్సి వచ్చింది..? ఆత్మహత్యే అనుకుంటే..ఎందుకు సూసైడ్‌ చేసుకోవాల్సి వచ్చింది..? భార్యాభర్తల మధ్య కుటుంబ తగాదాలేమైన ఉన్నాయా..? ఆ గొడవలతోనే ఆత్మహత్య చేసుకుందా..? అనూష మృతి వెనుక భర్త హస్తం ఉందా..? ఇప్పుడీ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డెత్‌ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు.