బీరు బాటిల్స్ తెచ్చుకొంటే కార్ సీజ్ చేస్తారా? హైకోర్టుకెక్కిన ఏపీ వాహనదారులు

  • Published By: srihari ,Published On : June 23, 2020 / 01:58 PM IST
బీరు బాటిల్స్ తెచ్చుకొంటే కార్ సీజ్ చేస్తారా? హైకోర్టుకెక్కిన ఏపీ వాహనదారులు

అక్రమ మద్యం తరలిస్తున్నారనే నేపంతో తమ వాహనాలు పోలీసు స్టేషన్ లోనే ఉంచుతున్నారంటూ ఏపీకి చెందిన వాహన యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. నాలుగు ఐదు బీర్ బాటిళ్లు, లిక్కర్ బాటిళ్లను కార్లలో తెస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసులు తమ వాహనాలను స్వాధీనం చేసుకున్నారంటూ వాహనాదారులు హైకోర్టులో తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను ఎక్సైస్ డిప్యూటీ కమిషనర్ కు గానీ, కోర్టులో గానీ అప్పగించకుండా పోలీసు స్టేషన్ లోనే ఎందుకు ఉంచుకుంటున్నారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. దీనికి అడ్వకేట్ జనరల్ చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని హైకోర్టు పోలీసులు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

ఇతర రాష్ట్రాల నుంచి ప్రధానంగా తెలంగాణ నుంచి  మద్యం తీసుకొచ్చే వాహనదారుల వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఇలాంటి వాహనాలను పోలీసులు తమ పోలీసు స్టేషన్ లోనే ఉంచుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ వాహనాలను సాధారణంగా సీజ్ చేసిన తర్వాత వాటిని ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ కు లేదా కోర్టుకు అప్పగించాల్సింది పోయి పోలీసులు స్టేషన్ల దగ్గరే ఉంచుకోవడంపై వాహనాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారంతా పోలీసుల తీరును నిరసిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై విచారించిన హైకోర్టు పోలీసులు సమాధానం చెప్పాలని ఆదేశించింది. పోలీసు స్టేషన్ లో వాహనాలు ఉంచాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. రేపు (బుధవారం) జూన్ 24న డీజీపీ గౌతం సవాంగ్ స్వయంగా హైకోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.