ప్రేమిస్తున్నానంటూ యువతిని వేధిస్తూ..తల్లిపై జవాన్ కాల్పులు

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 06:06 AM IST
ప్రేమిస్తున్నానంటూ యువతిని వేధిస్తూ..తల్లిపై జవాన్ కాల్పులు

గుంటూరు జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఓ ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే  మహిళకు గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన రమాదేవిని చికిత్సనిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జవాన్ కోసం గాలిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే..చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో బాలాజీ అనే వ్యక్తి ఆర్మీ ఉద్యోగిగా పనిచేశాడు. జవాన్ గా విధులు నిర్వహిస్తున్నప్పటి నుంచి ఏమాత్రం బాధ్యత లేకుండా ఆకతాయిగా..పోకిరిగా వ్యవరించేవాడు. బాలాజీ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న రమాదేవి కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. అతని వేధింపులు భరించలేక రమాదేవి తన కూతుర్ని తీసుకుని ఆరు నెలల క్రితం వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.అయినా బాలాజీ వేధింపులు ఆపలేదు.వాళ్లు ఎక్కడ ఉన్నారో గాలించి తెలుసుకుని వేధింపులు కొనసాగించాడు. 

అతని వేధింపులు భరించలేక రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమను తరచూ వేధిస్తున్నాడనీ..తమ కుమార్తెను రేప్ చేసాడనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు..బాలాజీపై కేసు నమోదు చేసుకుని  రిమాండ్‌కు తరలించారు. తరువాత కొంతకాలం జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు.దీంతో బాలాజీని అతని గన్ ను కూడా స్వాధీనం చేసుకు ఆర్మీ విధుల్లోనుంచి సస్పెండ్ చేశారు. 

ఈక్రమంలో తమ కుమార్తెను వేధించి వేధించి హింసపెట్టావు. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి కావటంలేదు. దీనికి కారణం నువ్వే కాబట్టి నువ్వే పెళ్లి చేసుకోవాలని సదరు రమాదేవి..ఆమె భర్త బాలాజీపై ఒత్తిడి తెచ్చారు. కానీ నా ఉద్యోగం పోవటానికి కారణం మీరే మీ అమ్మాయిని నేనెందుకు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేశాడు బాలాజీ. ఇలా బాలాజీకీ రమాదేవి కుటుంబాలకు మధ్య వివాదం కొనసాగుతున్న క్రమంలో మా అమ్మాయిని పెళ్లి చేసుకోల్సిందేనని మరోసారి బాలాజీ ఇంటికి శుక్రవారం (ఫిబ్రవరి 21,2020)అర్ధరాత్రి వచ్చి డిమాండ్ చేయటంతో ఆగ్రహానికి గురైన బాలాజీ తన వద్ద ఉన్న ఓ నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల నుంచి రమాదేవి తృటిలో తప్పించుకోవటంతో గాయాలతో బైటపడింది. దీంతో రమాదేవిని స్థానిక హాస్పిటల్ కు  తరలించి చికిత్సందిస్తున్నారు.