హైటెక్ ముఠాలు : డెబిట్ కార్డుల డేటా చోరీ

  • Published By: madhu ,Published On : October 26, 2019 / 04:32 AM IST
హైటెక్ ముఠాలు : డెబిట్ కార్డుల డేటా చోరీ

ఏటీఎం కేంద్రాలే..టార్గెట్‌గా డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ ముఠాను ఆబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోనూ ఇలాంటి హైటెక్ ముఠాలు ఉన్నాయని, అవి స్కిమ్మింగ్, క్లోనింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా పబ్లిక్ ప్లేసులే అడ్డాగా చేసుకుని దందా కొనసాగించే ఈ ముఠాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. స్కిమ్మింగ్ చేసే విధానాలను వివరిస్తున్నారు.

మినీ స్కిమ్మర్లుగా పిలిచే అత్యాధునిక యంత్రాలను ఇంటర్‌నెట్, డార్క్ వెబ్ ద్వారా చైనా నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. కొంతమందిని మచ్చిక చేసుకుని ఈ పరికరాలను అందిస్తున్నారు. కేవలం అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉండే వీటిని ఎప్పటికీ తమ జేబుల్లో ఉంచుకుంటున్నారు. ఎవరైనా డబ్బు చెల్లింపు కోసం డెబిట్ కార్డు ఇచ్చిన సమయంలో అదను చూసి ఆ కార్డును స్కిమ్మర్‌లోనూ ఒకసారి స్వైప్ చేస్తున్నారు. అందులో ఉండే డేటా మొత్తం స్కిమ్మర్‌కు చేరుతోంది. కస్టమర్ ఎంటర్ చేసే పిన్‌ను జాగ్రత్తగా గమనిస్తారు. తర్వాత కార్డును వినియోగదారుడికి ఇచ్చేస్తుంటారు. 

తర్వాత డేటాను అసలు సూత్రధారులకు ఇస్తారు. ఇలా చేసినందుక వీరికి కమీషన్ లేదా..కొంత మొత్తం సూత్రధారుల నుంచి అందుతుంది. ల్యాప్ టాప్‌కు స్కిమ్మర్లు కనెక్టు చేయడం ద్వారా వాటిలోకి అప్ లోడ్ చేస్తారు. వినియోగదారుడి కార్డుకు నకలు ముఠా వద్ద తయారు అవుతుందన్నమాట. దీని ద్వారా మోసాలకు పాల్పడుతుంటారు. 

డెబిట్ కార్డులనే కాదు క్రెడిట్ కార్డులనూ క్లోన్ చేసే ఆస్కారం ఉంది. కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మీ కార్డు ఎదుటి వ్యక్తి చేతికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చే వరకూ గమనిస్తూ ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్ నెంబర్ చెప్పకూడదన్నారు. ముఠాల బారినపడకుండా అవసరమైన తగిన జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అంటున్నారు. 
Read More : హైదరాబాదీలు రెడీ అవ్వండి.. మేఘాలలో భోజనం చేద్దాం