ఆత్మహత్య చేసుకుంటావా.. హత్య చేయాలా : కంప్లయింట్ చేసిన శ్రీనివాసరావు కుటుంబం

  • Published By: chvmurthy ,Published On : September 23, 2019 / 12:21 PM IST
ఆత్మహత్య చేసుకుంటావా.. హత్య చేయాలా : కంప్లయింట్ చేసిన శ్రీనివాసరావు కుటుంబం

ఏపీ సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో…ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన హత్యాయత్నం కేసు లో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.  నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ అధికారుల నుండి ప్రాణ హాని ఉందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈమేరకు వారి తరుఫు లాయర్ అబ్దుల్  సలీమ్, సోదరుడు సుబ్బరాజు లు  రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. 

ఆత్మహత్య చేసుకుంటావా, లేకపోతే హత్య చేయాలా అంటూ జైలు అధికారులు శ్రీనివాసరావును బెదిరిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కోన్నారు.  శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతోనే  జైలు అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు  అతని సోదరుడు సుబ్బరాజు, లాయరు అబ్దుస్ సలీమ్ తెలిపారు.

సీఎం జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రజాసంకల్ప యాత్ర చేశారు. అందులో భాగంగా 2018, అక్టోబర్ 25 గురువారం నాడు ఆయన హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో జన్నుపల్లి శ్రీనివాస రావు జగన్ తో సెల్ఫీ తీసుకునే నెపంతో ఎయిర్  పోర్టులో ఆయనకు దగ్గరగా వచ్చి పందెం కోడికి కట్టే కత్తితో ఆయనపై దాడి చేశాడు. జగన్ అప్రమత్తం  కావడంతో, పెద్ద ప్రమాదం తప్పి, భుజంపై గాయం అయ్యింది. ఈ కేసుకు సంబంధించి శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు.