పోలీసులపై దాడి : కోయిల్ కొండ లో ఉద్రిక్తత

  • Published By: chvmurthy ,Published On : February 4, 2019 / 10:09 AM IST
పోలీసులపై దాడి : కోయిల్ కొండ లో ఉద్రిక్తత

కోయిల్‌కొండ: మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలం దమ్మాయి పల్లిలో సోమవారం ఉద్రిక్తత  చోటు చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణ పేట్ ను కొత్త జిల్లాగా ఏర్పాటు  చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. కోయిల్‌కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపవద్దని మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంచాలని గ్రామస్తులు  గత 15 రోజులు గా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం కోయిల్ కొండ గ్రాస్తులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. 

అఖిలపక్షం ఆధ్వర్యంలో  సోమవారం నాడు  మహబూబ్‌నగర్‌-కోయిల్‌కొండ మార్గంలోని దమ్మాయిపల్లి గేటు వద్ద వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు.  పోలీసులు అనుమతించిన టైమ్   దాటి పోవటంతో పోలీసుల వారిని అక్కడి నుంచి  వెళ్లిపొమ్మని చెప్పగా, గ్రామస్తులకు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది.  దీంతో ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారు.  ఆందోళనకారులు విసిరిన రాయి తగిలి సీఐ పాండురంగారెడ్డి తలకు గాయమైంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అదనపు బలగాలను అక్కడకు తరలించి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పరిస్థతిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.