Aunty Murder Mystery : అత్తను చంపిన అల్లుడు- నిందితుడిని పట్టించిన లుంగీ

పరిచయమైనప్పటినుంచి బుధ్దిమంతుడిగా ఉన్న యువకుడికి ఒక మహిళ తన పిల్లనిచ్చి వివాహం జరిపించింది. పెళ్లైన కొన్నాళ్లకే పనిమానేసి ఇంట్లో కూర్చుంటే మందలించింది. ఆకోపంతో అత్తను హత్య చేశాడు అల్లుడు. నాలుగు నెలల తర్వాత అల్లుడు కట్టుకునే లుంగీ అత్తను హత్యచేసిన అల్లుడిని పట్టించింది.

Aunty Murder Mystery : అత్తను చంపిన అల్లుడు- నిందితుడిని పట్టించిన లుంగీ

Aunt Murdered By Son In Law

Aunty murdered by son-in-law at Srikalahasti : పరిచయమైనప్పటి నుంచి బుధ్దిమంతుడిగా ఉన్న యువకుడికి ఒక మహిళ తన పిల్లనిచ్చి వివాహం జరిపించింది. పెళ్లైన కొన్నాళ్లకే పనిమానేసి ఇంట్లో కూర్చుంటే మందలించింది. ఆకోపంతో అత్తను హత్య చేశాడు అల్లుడు. నాలుగు నెలల తర్వాత అల్లుడు కట్టుకునే లుంగీ అత్తను హత్యచేసిన అల్లుడిని పట్టించింది.

చిత్తూరు జిల్లా శ్రీకాళ హస్తి మండలం విశాలాక్షి నగర్ కు చెందిన అమ్ములు(45) అనే మహిళ స్ధానికంగా హోటల్ లో పని చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని పోషించుకుంటోంది. భర్త వెంకట రెడ్డి 9ఏళ్ల క్రితం కన్నుమూశాడు. ఈమె పెద్ద కుమార్తెకు పెళ్లి చేసింది. ఈక్రమంలో శ్రీకాళహస్తిలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న తెలంగాణ, ఖమ్మం జిల్లాకు చెందిన నిరంజన్ అలియాస్ నాగరాజు(30) అనే వ్యక్తి 9 ఏళ్ల క్రితం పరిచయం అయ్యాడు.

పరిచయం అయినప్పటి నుంచి అతడి నడవడిక చూసి చిన్న కూతురు ఉషను ఇచ్చి వివాహం జరిపించింది. అమ్ములు బీసీ, నిరంజన్ ఎస్టీ  కావటంతో వీరి పెళ్లికి అమ్ములు తరుఫు బంధువులు అభ్యంతరం చెప్పారు.  అయినా,  పిల్లవాడు బుద్దిమంతుడని చెప్పి కూతుర్నిచ్చి వివాహం జరిపించింది. అల్లుడిని ఇల్లరికం చేసుకుంది. వారికి ఒక కొడుకు, కూతురు పుట్టారు.

కొంతకాలం  తర్వాత నిరంజన్ పనికి వెళ్లకుండా సోమరితనానికి అలవాటు పడ్డాడు.  ఇంట్లో ఉన్నప్పుడల్లా అత్తతో  గొడవపడేవాడు. కుటుంబం పోషించుకోటానికి పనులకు వెళ్లాలని ఆమె ఎంతచెప్పినా వినకుండా ఆమెతో వాగ్వాదానికి దిగేవాడు.  నిరంజన్  పనికి వెళ్లకపోవటంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు  ఉష   శ్రీ సిటీలోని ప్రైవేట్ కర్మాగారంలో ఉద్యోగంలో చేరింది. గతేడాదిగా ఇంట్లో ఖర్చులు పెరిగిపోయి అమ్ములు  కొంత అప్పులు  చేయాల్సివచ్చింది.

కాగా గతేడాది డిసెంబర్ నుంచి అమ్ములు కనిపించకుండా పోయింది. ఆమె కోసం కూతరు అల్లుడు వెదికారు. అయినా ఆమె ఆచూకి లభ్యంకాలేదు. అప్పుల వారికి సమాధానం చెప్పలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నిరంజన్  అందరికీ చెప్పాడు. మరికొన్నాళ్ళకు బుచ్చినాయుడు కండ్రిగ వద్ద తన స్నేహితుడికి కనపడిందని….తాను క్షేమంగానే ఉన్నానని.. ఇప్పట్లో ఇంటికి రాలేనని చెప్పిందని నిరంజన్  కుటుంబ సభ్యులకు చెప్పాడు.

తల్లి ఆచూకి లభించకపోయే సరికి ఉష పోలీసు రిపోర్టు ఇద్దామని నిర్ణయించుకుంది. ఆమె ప్రయత్నాన్ని నిరంజన్  అడ్డుకున్నాడు. ఎక్కడో ఒకచోట క్షేమంగానే ఉందిగా… ఇప్పుడు పోలీసు రిపోర్ట్ ఇవ్వటం ఎందుకని వారిని ఫిర్యాదు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ఈక్రమంలో ఉష  జనవరి 9న, అమ్ములు అదృశ్యంపై శ్రీకాళహస్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు.

కేసు నమోదైన తర్వాత మరో 10 రోజులు  అత్త కోసంగాలింపు చేపట్టాడు నిరంజన్. అయినా అత్త ఆచూకి లభించకపోయేసరికి … ఇక్కడ పనులేమి దొరకటం లేదని … ఖమ్మం వెళ్దామని భార్యకు చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోక పోవటంతో కొడుకుని తీసుకుని ఫిబ్రవరిలో ఖమ్మం వెళ్లిపోయాడు. అప్పటి నుంచి భార్యతో ఫోన్ లో మాట్లడమే కానీ భార్య, కూతుర్ని చూడటానికి శ్రీకాళహస్తి రాలేదు.

ఇలా ఉండగా ఉష నివసిస్తున్న ఇంటి వెనుక పక్క ఉన్నపేడ దిబ్బ పేరుకు పోవటంతో ఇరుగు పొరుగు వారి ఒత్తిడితో ఆదివారం వాటిని తొలగించారు. ఈ క్రమంలో కొన్ని ఎముకలు బయటపడటంతో పేడ దిబ్బ ఎత్తుతున్న కూలీలు భయపడ్డారు.  ఈవార్త  ఆచుట్టు పక్కల వ్యాపించటంతో స్ధానికులు అక్కడ గూమి కూడారు. దిబ్బను మరింతగా తవ్వగా అమ్ములు చీర, నిరంజన్ లుంగీ బయటపడ్డాయి.

అది తన తల్లి చీర, నిరంజన్ లుంగీ అని నిర్ధారించుకున్న ఉష , ఎముకలు… కనపడకుండా పోయిన తన తల్లి మృతదేహానివేనని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు  ఎముకలు గుర్తించి  శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి  వైద్యాధికారికి సమాచారం ఇచ్చారు.  కళేబరం అవశేషాలు, ఎముకలను పరిశీలించిన వైద్యులు తలపై బండరాయితో కానీ, రోకలితో కానీ కొట్టి చంపినట్లు నిర్ధారించారు.

కాగా నిందితుడు నిరంజన్  అత్త.. అమ్ములుని హత్య చేసి, తన లుంగీ చుట్టీ ఆమెను పేడ దిబ్బలో కప్పిపెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత కొన్నాళ్లుగా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వోద్దని చెప్పటం…అత్తా అల్లుళ్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనటం..వంటి విషయాలు ఉష పోలీసులకు చెప్పింది.  అమ్ములు మృతదేహం ఎముకలు దొరికినప్పటినుంచి నిరంజన్ ఫోన్ స్విచ్చాఫ్ రావటంతో పోలీసులు నిరంజన్ కోసం గాలింపు చేపట్టారు.