వెంకటేష్ మోసపోయాడా? బ్యాంకు ఉద్యోగిని దివ్య కేసులో అసలేం జరిగింది

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన గజ్వేల్ బ్యాంకు ఉద్యోగిని న్యాలకంటి దివ్య హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. నిందితుడు వెంకటేశ్ ను విచారిస్తున్న

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 06:18 AM IST
వెంకటేష్ మోసపోయాడా? బ్యాంకు ఉద్యోగిని దివ్య కేసులో అసలేం జరిగింది

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన గజ్వేల్ బ్యాంకు ఉద్యోగిని న్యాలకంటి దివ్య హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. నిందితుడు వెంకటేశ్ ను విచారిస్తున్న

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన గజ్వేల్ బ్యాంకు ఉద్యోగిని న్యాలకంటి దివ్య హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. నిందితుడు వెంకటేశ్ ను విచారిస్తున్న పోలీసులు.. ఇవాళ(ఫిబ్రవరి 20,2020) సీన్ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు. నిందితుడు వెంకటేశ్ ను ఘటనా స్థలికి తీసుకెళ్లనున్నారు. ఏ విధంగా దివ్య పై దాడి చేసింది, చంపింది అనే వివరాలు తెలుసుకుంటారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. కేసుకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు.

దివ్య హత్యోదంతం మలుపులు తిరిగింది. ప్రేమ పేరుతో దివ్యను వెంకటేశ్ వేధించాడని, పెళ్లికి ఒప్పుకోలేదనే చంపేశాడని దివ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంకటేశ్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. దివ్య మోసం చేసింది, మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది.. అందుకే చంపేశానని అంటున్నాడు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. అసలేం జరిగింది? దివ్యను వెంకటేశ్ వేధించాడా? లేక దివ్య వెంకటేశ్ ను మోసం చేసిందా? అనే ప్రశ్నలకు పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

పథకం ప్రకారమే దివ్య హత్య జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచారం. మంగళవారం(ఫిబ్రవరి 19,2020) రాత్రి గజ్వేల్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యపై దాడి చేసి పదునైన ఆయుధంతో గొంతు కోయడంతో ఆమె మృతిచెందింది. ప్రేమ పేరుతో కొన్నేళ్లుగా వేధిస్తున్న వెంకటేశ్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అయితే, దివ్య, తన కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, హైదరాబాద్‌లో ఇరువురూ కలిసి కొంతకాలం ఉన్నారని వెంకటేశ్‌ తండ్రి చెప్పడం సంచలనంగా మారింది. మరోపక్క హత్య తర్వాత పరారీలో ఉన్న వెంకటేశ్‌… బుధవారం(ఫిబ్రవరి 20,2020) స్వయంగా వచ్చి వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. దివ్యని నేనే చంపాను, నన్ను మోసం చేసింది.. అందుకే చంపాను అని వెంకటేశ్ పోలీసులతో చెప్పినట్టు సమాచారం.

10 తరగతి నుంచే:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాలపల్లి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. హత్యకు గురైన దివ్య చిన్న కుమార్తె. లక్ష్మీరాజం వేములవాడ ఆలయం దగ్గర కిరాణా దుకాణం నిర్వహిస్తూ ప్రైవేటు లాడ్జిని లీజుకు తీసుకొని నడిపేవారు. ఆ సమయంలో దివ్య వేములవాడలోని వెంకటరమణ ప్రైవేటు స్కూల్ లో టెన్త్‌ చదివింది. వేములవాడలోని శాస్త్రినగర్‌కు చెందిన కైరి పరుశురాం, లత దంపతుల కుమారుడు వెంకటేశ్‌ కూడా అదే స్కూల్ లో 10వ తరగతి చదివాడు. అప్పటినుంచే దివ్యను ప్రేమ పేరుతో వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటర్‌ సమయంలోనూ వేధింపులు కొనసాగించాడని, దీంతో వెంకటేశ్‌పై వేములవాడ, ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశామని చెబుతున్నారు. ఓసారి దివ్య కోసం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. వెంకటేశ్‌ కుటుంబీకులు తమపై దాడికి ప్రయత్నించారని లక్ష్మీరాజం వెల్లడించారు. దీంతో తాము కొంతకాలం హైదరాబాద్‌ వెళ్లిపోయామని.. అప్పుడే తమ కుమార్తె ఓయూలో డిగ్రీ పూర్తిచేసి, ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో ఉద్యోగం సాధించిందన్నారు. 

వరంగల్‌కు చెందిన సందీప్‌తో దివ్యకు పెళ్లి కుదిరింది. ఫిబ్రవరి 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఇది తెలుసుకున్న వెంకటేష్.. దివ్యపై కక్ష పెంచుకున్నాడు. కొంతకాలంగా గజ్వేల్‌ వచ్చి ఆమెను దూరం నుంచి గమనించడం.. ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరగడం చేస్తుండేవాడని పోలీసు విచారణలో బయటపడినట్టు సమాచారం. పథకం ప్రకారం ఆమెను హత్య చేసే ఉద్దేశంతో గజ్వేల్‌ వచ్చాడని, దివ్య తల్లిదండ్రులు పెళ్లి పనులపై ఎల్లారెడ్డిపేట వెళ్లారని తెలియడంతో అదను చూసి ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడిచేసి చంపేశాడని అనుమానిస్తున్నారు. దివ్య కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకటేశ్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ట్రేస్‌ చేయగా.. ఆ సమయం లో అతడు గజ్వేల్‌లోనే ఉన్నట్టు వెల్లడైంది. దీంతో వెంకటేశ్‌ను పట్టుకునేందుకు గజ్వేల్, వేములవాడలకు రెండు ప్రత్యేక బృందాలను పంపించారు. అనంతరం వెంకటేశ్‌ తల్లిదండ్రులను విచారణ నిమిత్తం వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్‌ నేరుగా పీఎస్ కి వచ్చి లొంగిపోయాడు. విచారణ నిమిత్తం సిద్దిపేట పోలీసులకు అప్పగించారు. 

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు:
వెంకటేశ్, దివ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. వెంకటేశ్ తండ్రి పరుశురాం చెప్పారు. ఇద్దరూ 10వ తరగతి సమయంలోనే ప్రేమలో పడ్డారని తెలిపారు. పెళ్లయిన తర్వాత దివ్య తల్లిదండ్రులు ఆమెను ఇక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారన్నారు. దీంతో తానే స్వయంగా డబ్బు ఖర్చుచేసి దివ్యను హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంచి చదివించానన్నారు. ఓయూ క్యాంపస్‌లో చదువుతున్న దివ్య.. దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంజనీరింగ్‌ కోచింగ్‌ తీసుకుంటున్న వెంకటేశ్‌తో కలసి ఉన్నట్లు వివరించారు. బ్యాంకు ఉద్యోగం వచ్చాక దివ్య ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. అప్పట్నుంచి తన కొడుకు వెంకటేశ్‌ ఇబ్బందులు పడుతున్నాడని చెప్పారు. తిరిగి దివ్యకు తల్లిదండ్రులు దగ్గరై పెళ్లి సంబంధాలు చూడటంతో వెంకటేశ్‌ మానసిక సంఘర్షణకు గురయ్యాడన్నారు. నిజానికి తన కుమారుడు పిరికివాడని, హత్య చేసేంత ధైర్యం అతడికి లేదని అతని తండ్రి పరశురాం వివరించారు.

ఇలా.. దివ్య కేసు అనేక మలుపులు తిరిగింది. దివ్య తల్లిదండ్రులు ఒకలా, వెంకటేశ్ తల్లిదండ్రులు మరోలా చెబుతున్నారు. ఎవరు ఎవరిని మోసం చేశారు? ఎవరు మాటలు నిజం, ఎవరి మాటలు అబద్ధం? దివ్య మోసం చేసిందా? వెంకటేశ్ ప్రేమోన్మాదా? అసలేం జరిగింది. పోలీసులు నోరు విప్పితే కానీ.. ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Read More>>ఢిల్లీలో జనసేనాని.. ‘ఇదెప్పుడో చేయాల్సింది కుదరలేదు’