Basavalinga Swamy suicide..Honeytrap : హనీట్రాప్‌ చిక్కుకుని మఠాధిపతి బసవలింగ మహాస్వామి ఆత్మహత్య..

కర్ణాటకలోని రామనగర్ జిల్లాలో కంచుగల్‌ బండె మఠాధిపతి బసవలింగ మహాస్వామి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 25 ఏళ్లుగా మఠానికి నాయకత్వం వహిస్తున్న స్వామీ ఆత్మహత్య కర్ణాటకలో తీవ్ర చర్చకు దారితీసింది. స్వామీజీ హనీట్రాప్ లో చిక్కుకోవటం వల్లే ఆత్మహత్య చేసుకోవటం మరింత సంచలనంగా మారింది.

Basavalinga Swamy suicide..Honeytrap : కర్ణాటకలోని రామనగర్ జిల్లాలో కంచుగల్‌ బండె మఠాధిపతి బసవలింగ మహాస్వామి సోమవారం (అక్టోబర్ 24,2022) తెల్లవారుఝామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 25 ఏళ్లుగా మఠానికి నాయకత్వం వహిస్తున్న స్వామీ ఆత్మహత్య కర్ణాటకలో తీవ్ర చర్చకు దారితీసింది. కిటికీ గ్రిల్ కు ఉరి వేసుకుని మహాస్వామి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం కలిగించింది. ఈ మఠానికి 400ల ఏళ్ల చరిత్ర ఉంది. మరొక విషయం ఏమిటంటే స్వామీజీ హనీట్రాప్ లో చిక్కుకోవటం వల్లే ఆత్మహత్య చేసుకోవటం మరింత సంచలనంగా మారింది. హనీట్రాప్ లో చిక్కుకోవటం వల్లే బసవలింగ మహాస్వామి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల విచారణ వెల్లడైంది. ఓ మహిళను అడ్డంపెట్టుకుని స్వామీజీని కొందరు హనీట్రాప్‌ చేశారని.. ఆ ఒత్తిడి, వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

బెంగళూరుకు చెందిన ఓ మహిళతో ఆయన కొద్ది రోజులుగా ఆడియో..వీడియో ఛాటింగ్‌ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. మఠాధిపతి ఛాటింగ్‌ను, వీడియోలను బయటపెడతామని బెదిరింపులు రావడంతో ఆయన మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 24న కుదుర్ పోలీసులు స్వామీ మృతదేహాన్ని కనుగొన్న గదిలో రెండు పేజీల సూసైడ్ నోట్ ను గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి అయ్యాక సోమవారం సాయంత్రం మఠం ఆవరణలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా కేసు నమోదు చేసి విచారణ జరిపిన కుదర్ పోలీసులు..స్వామీజీ కాల్‌ డేటా రికార్డులను పరిశీలించి కొందరు వ్యక్తులు ఆయనను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లుగా నిర్ధారించారు. బసవలింగ కొంత మంది వ్యక్తుల పేర్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఆ వ్యక్తులు ఎవరు? వంటి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.

కేసు గురించి రామనగర్‌ ఎస్పీ సంతోష్‌ బాబు మాట్లాడుతూ.. స్వామీజీ తన డెత్‌ నోట్‌లో కొందరి పేర్లను ప్రస్తావించారని.. ఆయన మరణానికి, సూసైడ్‌ నోట్‌లో ఉన్న వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. మాగడిలోని కుదూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా.. నిందితులుగా ఇంకా ఎవరి పేర్లూ పేర్కొనలేదని..స్వామీజీ నిజంగానే వేధింపులకు గురయ్యారా? లేదా? అన్నది తెలియాల్సి ఉందని.. కేసులో ఎవరెవరు ఉన్నారనేది దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్పీ తెలిపారు.

కాగా..ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన కేసులో మురుగ మఠంలోని చీఫ్‌ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు నిందితుడు. శివమూర్తి అరెస్టైన తరువాత.. నిందితుల వలలో 45 ఏళ్ల బసవలింగ స్వామి చిక్కుకున్నారని.. వారి వేధింపుల వల్లనే స్వామి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మఠం ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను సిద్ధగంగ మఠం నుంచి వచ్చిన ప్రతినిధులు పరిశీలించారు. మఠం నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా బెంగళూరులో గురువణ్ణ మఠానికి అప్పగించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు