Panjagutta Nisha Case : పంజాగుట్టలో నిషాపై ఎమ్మెల్యే అనుచరుడి దాడి కేసులో బిగ్ ట్విస్ట్

హైదరాబాద్ పంజాగుట్టలో నిషా అనే మహిళపై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిషా డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చారు. ఓ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న విజయ్ సింహాను ఇరికించడానికి నిషా నాటకాలు ఆడినట్లు నిర్ధారించారు.

Panjagutta Nisha Case : పంజాగుట్టలో నిషాపై ఎమ్మెల్యే అనుచరుడి దాడి కేసులో బిగ్ ట్విస్ట్

Panjagutta Nisha Case : హైదరాబాద్ పంజాగుట్టలో నిషా అనే మహిళపై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిషా డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చారు. ఓ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న విజయ్ సింహాను ఇరికించడానికి నిషా నాటకాలు ఆడినట్లు నిర్ధారించారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తనపై నిషా ఆరోపణలు చేసినప్పటికీ ఆమెపై ఇప్పటివరకు విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది.

ఓ ఎమ్మెల్యే అనుచరుడు విజయ్ సింహా తనను వేధించాడని, తనపై కత్తితో దాడి చేశాడని నిషా ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాఫ్తు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి 12 గంటల పాటు విచారించారు. పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించారు. టెక్నికల్ ఎవిడెన్స్ కింద విజయ్ సెల్ టవర్ లొకేషన్ ను కూడా పోలీసులు సేకరించారు.

విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. నిషా మెడపై ఎలాంటి గాయాలు లేవు. అసలు ఈ కేసుకి, విజయ్ సింహాకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదంతా నిషా ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చారు. విజయ్ సింహాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని చెప్పారు. విజయ్ సింహాను ఇరికించేందుకు నిషా కుట్ర చేసిందని పోలీసులు తమ విచారణలో తేల్చారు. నిషా గొంతుపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు చెప్పాక అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేయగా, అసలు గుట్టు బట్టబయలైంది.

కాగా.. నిషా చేసిన ఆరోపణల వెనుక కుట్ర ఉందని విజయ్ సింహా ఆరోపించారు. ఇదంతా మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ చేసిన కుట్ర అని ఆయన చెప్పారు. తనపై కేసు పెట్టేందుకు బాబా ఫసియుద్దీన్.. నిషాకు 3లక్షలు రూపాయలు ఇచ్చారని విజయ్ సింహా ఆరోపించారు.

అర్థరాత్రి తన ఇంట్లోకి దూసుకొచ్చి మరీ, విజయసింహా తన గొంతు కోశాడని నిషా చెప్పింది. అంతేకాదు, లైంగికంగా వేధిస్తున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి పంపించి, చికిత్స అందించారు.

అయితే.. నిషా ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆ సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని విజయసింహా ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలో నిషా గొంతుపై కత్తి గాట్లు లేవని డాక్టర్లు చెప్పారు. అప్పుడు పోలీసులు నిలదీయగా.. అసలు విషయం చెప్పింది నిషా. తనని దూరం పెడుతున్నందుకే, కోపంతో ఈ పనికి పాల్పడ్డానని చెప్పింది. అతడ్ని ఇరికించాలనే డ్రామా ఆడినట్టు ఒప్పుకుంది. దాంతో.. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇంటికి పంపించారు.

మరోవైపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక.. మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది నిషా. తనపై తప్పు ప్రచారాలు చేస్తున్నారని ఆమె వాపోయింది. తాను ఎన్నో బాధలు అనుభవించాను అని చెప్పింది. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే తాను డీజీపీకి ఫిర్యాదు చేస్తానంది.