బయో డైవర్సిటీ..స్పీడ్‌ థ్రిల్స్‌..బట్‌ కిల్స్‌ : 6 రోజులు..550 ఓవర్ స్పీడు చలాన్లు

  • Published By: madhu ,Published On : November 24, 2019 / 01:59 AM IST
బయో డైవర్సిటీ..స్పీడ్‌ థ్రిల్స్‌..బట్‌ కిల్స్‌ : 6 రోజులు..550 ఓవర్ స్పీడు చలాన్లు

అతివేగానికి మరో ప్రాణం బలైపోయింది. రూ. 69.47 కోట్లతో నిర్మించిన బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై కారు పల్టీలు కొడుతూ కిందపడిన ఘటనలో మహిళ మృతి చెందడం కలకలం రేపింది. డిజైన్ లోపం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని సిటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్‌పై గత 6 రోజుల్లో 550 ఓవర్‌స్పీడ్‌ చలాన్లు నమోదయ్యాయి. ప్రమాదానికి గురైన కారు కూడా.. 104 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై 40 కిలోమీటర్ల వేగానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ ఈ నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. కేవలం 6 రోజుల్లోనే 5 వందలకు పైగా ఓవర్‌స్పీడ్‌ చలాన్లు నమోదవడమే దీనికి నిదర్శనం. 

స్పీడ్‌ థ్రిల్స్‌.. బట్‌ కిల్స్‌ అనే ఇంగ్లీష్‌ స్లోగన్‌ ఈ ప్రమాదానికి అతికినట్టు సరిపోతుంది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా.. ఎన్ని జరిమానాలు విధించినా.. అతివేగాన్ని మాత్రం కంట్రోల్‌ చేయలేకపోతున్నారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని చెబుతున్నారు రవాణా రంగ నిపుణులు. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. కేవలం మానవ తప్పిదం వల్లే ఓ నిండుప్రాణం బలైపోయిందన్నారు.

గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ దగ్గర ప్లైఓవర్‌ను ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. సుమారు కిలోమీటర్‌ పొడవున్న ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి 70 కోట్ల వరకు ఖర్చు చేసింది. దివ్యశ్రీ ఓరియన్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ ఫ్లైఓవర్‌ బయోడైవర్సిటీ దాటాక పూర్తవుతుంది. ఈ నెల 4న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ ఫ్లైఓవర్‌ని ప్రారంభించారు. 
ఈ నెల 10న ఈ ఫ్లై ఓవర్‌పై తొలిసారి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇదే ఫ్లై ఓవర్‌పై నుంచి కారు బోల్తా పడింది. ఇలా వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలతో ఫ్లైఓవర్‌ డిజైన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫ్లైఓవర్‌ డిజైన్‌లో అనేక లోపాలున్నాయనే అరోపణలు వినిపిస్తున్నాయి. డిజైన్‌లో లోపం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు కూడా చెబుతున్నారు. 

ఇక ఫ్లైఓవర్‌ డిజైన్‌లో లోపాలున్నాయని చెబుతున్నారు ఇంజినీరింగ్‌ నిపుణులు. ఫ్లైఓవర్‌ అలైన్‌మెంట్‌ సరిగా లేదంటున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ ఫ్లైఓవర్‌పై దృష్టిసారించాలని కోరుతున్నారు. 
Read More : మహా హారతి : ధర్మపురికి త్రిదండి చిన జీయర్ స్వామి