హైదరాబాద్ లోనే బోధ్ గయా పేలుళ్లకు కుట్ర

ఏడాది క్రితం బీహార్ లోని బోధ్ గయలో మూడు పేలుళ్లకు హైదరాబాద్ లోని కుట్ర జరిగిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అప్పట్లో మారేడ్ పల్లి ప్రాంతంలో తలదాచుకున్న సూత్రధారి కౌసర్ పర్యవేక్షణలోనే ఈ పేలుళ్లు జరిగాయని తెలిపారు. ఈ కేసులో సోమవారం(జనవరి 28,2019) NIA పాట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో సప్లిమెంటరీ చార్జి షీట్ దాఖలు చేసింది. మయన్మార్ లో రోహింగ్యాలపై జరుగుతున్న అఘూయిత్యాలకు ప్రతీకారం తీర్చుకోవాలని  జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)ఉగ్ర సంస్థ భావించింది.

బౌద్ధుల ప్రార్థన స్థలాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతోపాటు తమ ప్రతీకారం తీర్చుకోవాలని వీరు భావించారు.  బంగ్లాదేశ్ కి చెందిన మహమద్ జహీదుల్ ఇస్లాం అలియాస్ కౌసర్ జేఎంబీలో కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ లో అనేక పేలుళ్లకు పాల్పడటంతో కొన్నేళ్ల క్రితం అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. అయితే రెండేళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకొని భారత్ లోకి ప్రవేశించాడు. హైదరాబాద్ లోని మారేడ్ పల్లిలో తలదాచుకున్నాడు. హైదరాబాద్ లో ఉండగానే బోధ్ గయను టార్గెట్ గా ఎంచుకున్నాడు.

తనకు, జేఎంబీ కేడర్ కు మధ్య అనుసంధానకర్తగా ఉన్న దిల్వార్ హుస్సేన్ కి సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే హైదరాబాద్ చేరుకొన్న హుస్సేన్ కౌసర్ ని కలిశాడు. తమ అనుచరులు కొందరిని 2017, నవంబర్ లో  హైదరాబాద్ కి రప్పించాడు. ప్లాన్ చేసి 2018 జనవరి 19న బోధ్ గయలో మూడు చోట్ల బాంబులు అమర్చారు. వీటిలో ఒకటి పేలింది. రెండింటిని పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ ఉత్తరాదిన కొంతమంది నిందితులను అరెస్ట్ చేసింది. 

ట్రెండింగ్ వార్తలు