లైంగిక వేధింపులతో మహిళా ఎస్సై ఆత్మహత్య -ఫిజికల్ ట్రైనర్ అరెస్ట్

లైంగిక వేధింపులతో మహిళా ఎస్సై ఆత్మహత్య -ఫిజికల్ ట్రైనర్ అరెస్ట్

Bulandshahr: A Woman Sub-inspector Commits Suicide Due To Sexual Harassment : మహిళలు, యువతులపై లైంగిక వేధింపులు జరిగితే ఎవరికి చెప్పుకుంటారు….. పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. పోలీసు స్టేషన్ లోని మహిళా ఎస్సై కే లైంగిక వేధింపులు ఎదురైతే ? ….ఎవరికీ చేప్పుకోలేక ఆత్మహత్యచేసుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్, బులంద్ షహర్ జిల్లా లోని అనూప్ షహర్ పోలీసు స్టేషన్ లో ఎస్సై గా పని చేస్తున్న అర్జూ పవార్ ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు ఒక పోలీసు ఇనస్ట్రక్టర్ ఉమేష్ శర్మ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే….అనూప్ షహర్ కొత్వాలి పోలీసు స్టేషన్ లో పనిచేసే అర్జూ పవార్(30) అనే మహిళా ఎస్సై జనవరి1వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె 2015 నుంచి ఆ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె షామ్లి జిల్లాలోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ… ఒంటరిగా నివసిస్తోంది. అయితే గత కొంతకాలంగా ఆమె పోలీసు ఫిజికల్ ట్రైనింగ్ ఇనస్ట్రక్టర్ ఉమేష్ శర్మ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కోంటోంది. దీంతో తీవ్రంగా కలత చెంది తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆమె మరణించిన రోజు రాత్రి పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన ఏ కాల్స్ కి ఆమె సమాధానం ఇవ్వకపోవటంతో వారు ఇంటి యజమానిని సంప్రదించారు. ఆయన ఫోన్ చేసినా స్పందన లేకపోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చిన పోలీసులు..తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో…తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆమె ఫ్యానుకు ఉరి వేసుకుని ఉన్నారు.

మంచంపై రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి ఉంది. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు, తన చావుకు తానే కారణమని రాసి ఉంది. కాగా… సూసైడ్ నోట్ లో ఆమె ఫిజికల్ ట్రైనింగ్ ఇనస్ట్రక్టర్ ఉమేష్ శర్మపై ఆరోపణలు చేశారు. ఉమేష్ శర్మ ఆమెపై అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయనారంభించినట్లు రాసింది.

అత్యాచారం చేసిన వీడియోను చూపించి తనపై అనేక సార్లులైంగిక దాడికి పాల్పడ్డాడని తాను ఏమీ చేయలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని…తన చావుకు తానే కారణమని పేర్కోంది. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉమేష్ శర్మను అదుపులోకి తీసుకుని విచారించి ఆదివారం అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.